NTV Telugu Site icon

Badlapur sexual assault case: లైంగిక వేధింపులపై మహారాష్ట్ర ప్రభుత్వం సీరియస్.. సిట్ ఏర్పాటు

Badlapursexualassaultcase

Badlapursexualassaultcase

మహారాష్ట్రలోని థానే జిల్లాలోని బద్లాపూర్ ప్రైమరీ స్కూల్‌లో నర్సరీ బాలికలపై లైంగిక వేధింపుల వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేసింది. ఓ వైపు స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం.. ఇంకోవైపు పోలీసులు కేసు నమోదు చేయడంలో నిర్లక్ష్యం వహించడంతో బాధితులు, స్థానికులు ఆగ్రహంతో రగిలిపోయారు. దీంతో మంగళవారం పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. రైల్‌రోకోలు, రాస్తారోకోలు చేపట్టి రాకపోకలను స్తంభింపజేశారు. ఇక బద్లాపూర్ రైల్వే స్టేషన్‌లో ఆందోళనకారులు బీభత్సం సృష్టించారు. పోలీసులపై రాళ్ల వర్షం కురిపించారు. దీంతో పలువురికి గాయాలయ్యాయి. అలాగే స్కూల్ అద్దాలను కూడా ధ్వంసం చేశారు. పరిస్థితులు చేదాటి పోవడంతో పోలీసులు లాఠీలకు పని చెప్పారు. అలాగే నిరసనకారులపై భాష్పవాయువు ప్రయోగించి చెదరగొట్టారు.

ఈ ఘటనపై ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వంపై ఇండియా కూటమి నేతలు ధ్వజమెత్తారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని మండిపడ్డారు. డిప్యూటీ సీఎం ఫడ్నవిస్‌ను భర్తరఫ్ చేయాలని, అలాగే సిట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశాయి. ఇదిలా ఉంటే బద్లాపూర్ ఘటనపై సీఎం ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వం సమీక్ష నిర్వహించింది. సిట్ దర్యాప్తునకు ప్రభుత్వం ఆదేశించింది. దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పాఠశాల ప్రిన్సిపాల్‌తో పాటు మరో ఇద్దరిని సస్పెండ్ చేశారు. కేసును ఫాస్ట్‌ట్రాక్ కోర్టుకు బదిలీ చేసి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

ఇద్దరు నర్సరీ బాలికలపై స్కూల్‌ స్వీపర్‌ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. స్కూల్ టాయిలెట్‌లో బాలికలపై లైంగిక వేధింపులకు గురి చేశాడు. ఆగస్ట్‌ 12, 13 తేదీల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆగస్ట్‌ 16న బాలికల తల్లిదండ్రుల ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆలస్యంగా కేసు నమోదు చేయడంపై బాధిత కుటుంబాలు, స్థానికులు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. చిన్నారులపై లైంగిక వేధింపులను నిరసిస్తూ బద్లాపూర్‌ స్టేషన్‌లో రైల్‌రోకో చేపట్టారు. రైల్‌రోకోలో పెద్ద సంఖ్యలో స్థానికులు పాల్గొన్నారు. థానే నగరం, బద్లాపూర్‌ రైల్వే స్టేషన్‌ను నిరసనకారులు ముట్టడించారు. పోక్సో కేసు పెట్టడంలో ఇన్స్‌పెక్టర్‌ ఆలస్యం చేయడంపై ఆందోళనకారులు ధ్వజమెత్తారు. దీంతో ఇన్స్‌పెక్టర్‌ను ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేశారు. మరోవైపు నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

నాలుగేళ్ల బాలికలు.. అంతర్గత అవయవాలు దగ్గర తీవ్రమైన నొప్పి రావడంతో తల్లిదండ్రులకు తెలియజేశారు. దీంతో తల్లి గమనించి వివరాలు అడిగితే అసలు విషయం చెప్పడంతో పేరెంట్స్ ఖంగుతిన్నారు. డాక్టర్లకు చూపించగా బాలికలపై లైంగిక వేధింపులు జరిగినట్లుగా నిర్ధారించారు. మరోవైపు స్కూల్‌కు వెళ్లాలంటేనే పిల్లలు భయపడిపోతున్నారు. దీంతో బాధిత కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. కానీ కేసు నమోదు చేయడంలో మాత్రం నిర్లక్ష్యం వహించారు. అలాగే స్కూల్ పరిసరాలను పరిశీలించగా.. సరిగ్గా సీసీకెమెరాలు లేనట్టుగా గుర్తించారు. దీంతో బంధువులు, స్థానికులు పెద్ద ఎత్తున మంగళవారం ఆందోళనకు దిగారు.