Azamgarh Triple Murder Case: ఉత్తరప్రదేశ్‌లోని ఆజమ్‌గఢ్ జిల్లాలో జరిగిన వరుస హత్యల ఘటన తీవ్ర కలకలం రేపింది. అహ్రౌలా పోలీస్ స్టేషన్ పరిధిలోని శంభూపూర్ గ్రామంలో భార్యతో పాటు ఇంటికి పూజ కోసం వచ్చిన ఇద్దరు పూజారులను కాల్చిచంపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అరవింద్ సింగ్‌ను పోలీసులు ఎన్‌కౌంటర్‌లో హతమార్చారు. ఈ ఘటనలో నిందితుడి కుమారుడు కూడా మృతి చెందాడు.
కుమారుడిపై కూడా కాల్పులు
పోలీసుల కథనం ప్రకారం.. ఘటన సమయంలో అరవింద్ సింగ్ తన పిల్లలను ఓ గదిలో బంధించాడు. పోలీసులు అక్కడికి చేరుకుని అతడిని లొంగిపోవాలని, పిల్లలను సురక్షితంగా బయటకు పంపించాలని కోరారు. అతడితో మాట్లాడేందుకు కుటుంబ సభ్యుల సహాయాన్ని కూడా పోలీసులు తీసుకున్నట్లు ఆజమ్‌గఢ్ ఎస్‌ఎస్పీ డాక్టర్ అనిల్ కుమార్ తెలిపారు. అయితే నిందితుడు పోలీసులపై, కుటుంబ సభ్యులపై కాల్పులు జరుపుతానని, పిల్లలను చంపుతానని బెదిరించినట్లు ఎస్‌ఎస్పీ వెల్లడించారు. ఈ క్రమంలో తన కుమారుడిపై కూడా కాల్పులు జరిపినట్లు తెలిపారు.
పోలీసులపై కాల్పులు.. ప్రతిగా కాల్పులు
కుమారుడిపై కాల్పుల శబ్దం వినిపించడంతో పోలీసులు వెంటనే గదిలోకి ప్రవేశించినట్లు ఎస్‌ఎస్పీ తెలిపారు. ఆ సమయంలో అరవింద్ సింగ్ పోలీసులపై కాల్పులు జరిపాడని చెప్పారు. పోలీసులు హెచ్చరించినప్పటికీ కాల్పులు కొనసాగడంతో, ఆత్మరక్షణతో పాటు పిల్లల భద్రత కోసం పోలీసులు ప్రతిగా కాల్పులు జరిపినట్లు ఎస్‌ఎస్పీ పేర్కొన్నారు. ఈ కాల్పుల్లో అరవింద్ సింగ్ గాయపడగా, అతడిని ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్సకు ముందే ఆసుపత్రిలో అతడు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. అతడి కుమారుడిని కూడా ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
పూజ విషయంలో వివాదం
అసలు ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శంభూపూర్ గ్రామంలోని ఓ ఇంట్లో అరవింద్ సింగ్ కుటుంబ సభ్యులు పూజ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. కుటుంబానికి చెందిన గుడ్డు సింగ్ సుమారు రెండేళ్ల క్రితం కాల్పుల్లో మరణించడంతో, అతడి ఆత్మకు శాంతి కలగాలని కుటుంబ సభ్యులు పూజ నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ పూజను నిర్వహించేందుకు మహేంద్ర పాఠక్, అఖిలేశ్ మిశ్రా అనే ఇద్దరు పూజారులు ఇంటికి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే అరవింద్ సింగ్ పూజ నిర్వహించడాన్ని వ్యతిరేకించినట్లు పోలీసులు తెలిపారు.
కుటుంబ సభ్యులు అతడి అభ్యంతరాలను పట్టించుకోకుండా పూజ నిర్వహించడంతో అతడు ఆగ్రహానికి గురైనట్లు ఆరోపణలు ఉన్నాయి. అనంతరం తన భార్య బబితా సింగ్, పూజ నిర్వహించేందుకు వచ్చిన ఇద్దరు పూజారులు మహేంద్ర పాఠక్, అఖిలేశ్ మిశ్రాలపై కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు.
ఎస్‌ఎస్పీ వివరణ
ఆజమ్‌గఢ్ ఎస్‌ఎస్పీ డాక్టర్ అనిల్ కుమార్ నిందితుడి ఎన్‌కౌంటర్‌లో మృతిని ధృవీకరించారు. పిల్లలను రక్షించేందుకు, పోలీసులపై జరుగుతున్న కాల్పులను ఆపేందుకు ఆత్మరక్షణలో భాగంగానే పోలీసులు ప్రతిగా కాల్పులు జరిపినట్లు వివరించారు. ఈ ఘటనపై తదుపరి చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, కాల్పుల పరిస్థితులు, ఇతర అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది.

