ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో తీహార్ జైల్లో ఉన్న ముఖ్యమంత్రి కేజ్రీవాల్.. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే.సక్సెనాకు లేఖ రాశారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్ట్ 15 వేడుకల్లో జెండా వందన కార్యక్రమాన్ని నిర్వహించేందుకు మంత్రి అతిషికి అనుమతి ఇవ్వాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆమ్ ఆద్మీ పార్టీ ఓ ప్రకటనలో వెల్లడించింది. ప్రతి ఏడాది ఆగస్ట్ 15వ తేదీన ఛత్రసాల్ స్టేడియం వేదికగా కేజ్రీవాల్ ప్రభుత్వం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తుంది. అయితే కేజ్రీవాల్ జైల్లో ఉన్న కారణాన.. మంత్రి అతిషికి అవకాశం ఇవ్వాలని కోరారు.
లిక్కర్ కేసులో మార్చి 21న కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి ఆయన తీహార్ జైల్లో ఉంటున్నారు. మధ్యలో ట్రయల్ కోర్టు.. రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. కానీ సీబీఐ.. హైకోర్టుకు వెళ్లి అడ్డుకుంది. ఇదిలా ఉంటే లోక్‌సభ ఎన్నికల సమయంలో మాత్రం 21 రోజులు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అనంతరం జూన్ 2న తీహార్ జైల్లో లొంగిపోయారు.
ఇది కూడా చదవండి: Rash Car Driving: అతివేగంతో కారు నడుపుతూ మూడు బైకులను ఢీకొట్టిన మైనర్ బాలుడు..