Atiq Ahmed: గ్యాంగ్ స్టర్, మాఫియా డాన్, పొలిటికల్ లీడర్ అతిక్ అహ్మద్ హత్య దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. అతడితో పాటు ఆయన తమ్ముడు అష్రాఫ్ ను ముగ్గురు వ్యక్తులు, జర్నలిస్టులుగా నటిస్తూ అత్యంత సమీపం నుంచి కాల్పులు జరిపి హతమార్చారు. ఉమేష్ పాల్ హత్య కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న వీరిని ప్రయాగ్ రాజ్ లో ఓ ఆస్పత్రిలో వైద్య పరీక్షల కోసం తీసుకువస్తున్న నేపథ్యంలో ఈ హత్యలు జరిగాయి.
అతిక్ అహ్మద్, అతడి సోదరుడు అష్రాఫ్ శరీరంలోకి 13 బుల్లెట్లు దూసుకెళ్లినట్లు పోస్టుమార్టం నివేదికలో తేలింది. మొత్తం 22 సెకన్ల పాటు డజన్ రౌండ్లకు పైగా కాల్పులు జరిపారు నిందితులు. అతిక్ అహ్మద్ శరీరంలోకి 8 బుల్లెట్లు దూసుకెళ్లినట్లు తేలింది. అతని తల, మెడ, ఛాతీ మరియు నడుములో వరుసగా బుల్లెట్లను కనుగొన్నారు. అష్రాఫ్ మెడ, వీపు, మణికట్టు, కడుపు మరియు నడుము భాగంలో బుల్లెట్ గాయాలయ్యాయి. అష్రఫ్ శరీరంలో 3 బుల్లెట్లు లభించగా, మిగతా రెండు అతని శరీరాన్ని చీల్చుకెళ్లాయి.
Read Also: Beating Heart Diamond: వజ్రంలో వజ్రం.. అత్యంత అరుదైన వజ్రం.. సూరత్ కంపెనీకి లభ్యం..
ఈ ఘటన జరిగిన కొద్ది సేపటికే నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నేర సామ్రాజ్యంలో ఫేమస్ కావాలనే ఈ హత్యలు చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారు. ఈ ఘటనపై యూపీ ప్రభుత్వం ముగ్గురు సభ్యులతో జ్యూడీషియల్ కమిషన్ ఏర్పాటు చేసింది. 2 నెలలోగా రిపోర్టు ఇవ్వాలని కోరింది.
అతిక్ అహ్మద్, అతని తమ్ముడు అష్రాఫ్ పై 100కు పైగా క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఇందులో ప్రధానం అయినది 2005 బీఎస్పీ ఎమ్మెల్యే రాజు పాల్ హత్య కేసు, దీంతో పాటు ఈ కేసులో సాక్షిగా ఉన్న ఉమేష్ పాల్ ను కిడ్నాప్ చేయడం, ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉమేష్ పాల్ ను హత్య చేయడం వంటి వాటిలో ఇద్దరు నిందితులుగా ఉన్నారు. ఉమేష్ పాల్ హత్యలో కీలకంగా వ్యవహరించిన అతిక్ అహ్మద్ కొడుకు అసద్, నాలుగు రోజుల క్రితం ఝాన్సీలో పోలీసుల ఎన్ కౌంటర్ లో హతం అయ్యాడు. ఇది జరిగిన రెండు రోజులకే అతీక్ అహ్మద్ ను దుండగులు కాల్చి చంపారు.