Amit Shah: అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ దేశంలోని రిజర్వేషన్ల గురించి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఈ రోజు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ నేత చేసిన వ్యాఖ్యలపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విరుచుకుపడ్డారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై అమిత్ షా స్పందిస్తూ..‘‘దేశాన్ని విభజించే కుట్ర చేసే శక్తుల’’తో నిలబడటం రాహుల్ గాంధీకి అలవాటుగా మారిందని అన్నారు.
Read Also: Earthquake: భారత్, పాకిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్ లలో భూకంప ప్రకంపనలు..
‘‘దేశాన్ని విభజించేందుకు కుట్ర పన్నుతున్న శక్తులకు అండగా నిలవడం, దేశవ్యతిరేక ప్రకటనలు చేయడం రాహుల్ గాంధీకి, కాంగ్రెస్ పార్టీకి అలవాటైపోయింది. అది జమ్మూ కాశ్మీర్‌లో ఎన్‌సీ దేశ వ్యతిరేక, రిజర్వేషన్ వ్యతిరేక ఎజెండాకు మద్దతివ్వడం లేదా భారత వ్యతిరేక ప్రకటనలు చేయడం. విదేశీ వేదికలపై రాహుల్ గాంధీ ఎప్పుడూ దేశ భద్రతను బెదిరిస్తూ, మనోభావాలను దెబ్బతీస్తున్నారు’’ అని అమిత్ షా అన్నారు. ప్రాంతీయత, మతం, భాషా విబేధాల తరహాలో చీలికలు తెచ్చే కాంగ్రెస్ రాజకీయాలను రాహుల్ గాంధీ ప్రస్తావిస్తూ.. దేశంలో రిజర్వేషన్ల రద్దు గురించి మాట్లాడటం ద్వారా రాహుల్ గాంధీ మరోసారి కాంగ్రెస్ రిజర్వేషన్ వ్యతిరేక ముఖాన్ని తెరపైకి తెచ్చారని, అతడి మనసులో ఉన్న ఆలోచనలు బయటకు వచ్చాయని అన్నారు. బీజేపీ ఉన్నంత కాలం రిజర్వేషన్లను ఎవరూ రద్దు చేయలేరని, దేశ భద్రతతో ఎవరూ చెలగాలమాడకూడదని రాహుల్ గాంధీకి చెప్పాలనుకుంటున్నానని హోం మంత్రి అన్నారు.
అమెరికాలోని జార్జ్‌టౌన్ యూనివర్సిటీలో విద్యార్థులతో జరిగిన ఇంటరాక్షన్‌లో రాహుల్ గాంధీ రిజర్వేషన్లపై వ్యాఖ్యానించారు. ‘‘భారతదేశం న్యాయమైన ప్రదేశంగా మారినప్పుడు మేం రిజర్వేషన్ల రద్దు గురించి ఆలోచిస్తాం’’ అని అన్నారు. రిజర్వేషన్లను వ్యతిరేకించడం రాహుల్ గాంధీ వారసత్వమని, మాజీ ప్రధానులు జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ కూడా కుల ఆధారిత రిజర్వేషన్‌లకు వ్యతిరేకమని బీజేపీ సీనియర్ నేత రవిశంకర్ ప్రసాద్ అన్నారు. ఇండియా కూటమి నేతలైన డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్, వామపక్షాలు నేతలు రాహుల్ వ్యాఖ్యలపై స్పందించాలని అన్నారు.