Site icon NTV Telugu

Arvind Kejriwal: సీబీఐ విచారణను స్వాగతిస్తున్నాం

Arvind Kejriwal

Arvind Kejriwal

Arvind Kejriwal: దేశవ్యాప్తంగా పలు కేసులకు సంబంధించి వివిధ రాష్ట్రాల్లో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఢిల్లీలోని ఆమ్‌ ఆ‍ద్మీ పార్టీపై సీబీఐ ఫోకస్‌ పెట్టింది. ఢిల్లీ సర్కారు ఇటీవల కొత్త ఎక్సైజ్ పాలసీని ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే. ఈ విధానం అమలులో భారీ అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. దిల్లీలోని కేజ్రీవాల్​ ప్రభుత్వం గతేడాది నవంబర్​లో తీసుకొచ్చిన ఎక్సైజ్​ పాలసీ-2022 నిబంధనలకు విరుద్ధంగా ఉందనే ఆరోపణల నేపథ్యంలో ఈ దాడులు చేపట్టింది. ఎక్సైజ్​ పాలసీ తీసుకొచ్చిన సమయంలో దిల్లీ ఎక్సైజ్​ కమిషనర్​గా ఉన్న అరవ గోపీ కృష్ణ నివాసంలోనూ దర్యాప్తు సంస్థ తాజాగా తనిఖీలు నిర్వహిస్తోంది. సీబీఐ దాడుల విషయాన్ని ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా ధ్రువీకరించారు. తన నివాసంలో అధికారులు తనిఖీలు చేస్తున్నారంటూ ట్వీట్​ చేశారు. ఈ విషయంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ కూడా స్పందించారు. ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు.

CBI: ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఇంటిపై సీబీఐ దాడులు

సీబీఐ విచారణను స్వాగతిస్తున్నట్లు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఆ దర్యాప్తు సంస్థకు పూర్తిగా సహకరించనున్నట్లు వెల్లడించారు. ఈ విచారణ ద్వారా ఏమీ బయటకు రావనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. దేశ రాజధానిలోని ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా అధికారిక నివాసంతో సహా మొత్తం 21 ప్రాంతాల్లో తనిఖీలు చేపడుతున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఢిల్లీలోని పాఠశాలల అభివృద్ధి కోసం మనీశ్ సిసోడియా ఎంతో చేశారని కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీ ఎడ్యుకేషన్‌ మోడల్‌ను ప్రశంసిస్తూ అమెరికాకు చెందిన న్యూయార్క్‌ టైమ్స్‌లో ఇవాళ ఫ్రంట్ పేజీలో కథనం ప్రచురితమైందని.. ఇంతలోనే సీబీఐ సోదాలు చేయడం శోచనీయమన్నారు. గతంలో తమపై ఎన్నోసార్లు సోదాలు జరిగాయని కేజ్రీవాల్ స్పష్టం చేశారు.

Exit mobile version