దేశంలో కమ్యూనిస్టులకు కంచుకోట ఉన్న రాష్ట్రాల్లో కేరళ ఒక్కటి. కేరళీయులు రాజకీయాల్లో విభిన్న వైఖరిని అవలంభిస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తుంటారు. ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నపార్టీ మరోసారి అధికారంలోకి రావడం అనేది కష్టం. అలాంటిది గత ఎన్నికల్లో పినరయి విజయన్ వరుసగా రెండోసారి విక్టరీ సాధించి సరికొత్త రికార్డు సృష్టించారు. ఎన్నికల ముందు ఆయనపై విపక్షాలు ఎన్ని ఆరోపణలు చేసినా కేరళీయులు పినరయి వైపే మొగ్గుచూపారు. దీంతో కేరళకు ఆయనే మరోసారి సీఎం అయ్యారు.
పినరయి విజయన్ అధికారంలోకి వచ్చాక కేరళ అనేక అటుపోట్లకు గురైంది. ప్రకృతి ప్రకోపానికితోడు మానవ తప్పిదాల వల్ల కేరళ అతలాకుతలం అవుతోంది. తుఫానులు, వరదలు, కరోనా ఎఫెక్ట్ తో కేరళ ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కోంటోంది. ఇప్పటికీ కూడా కేరళను వరదలు వదలడం లేదు. దీనికితోడు కరోనాను తొలినాళ్లలో సమర్థవంతంగా ఎదుర్కొన్న కేరళలో ఇప్పుడు వేలాదిగా కేసులు నమోదు అవుతుండటం శోచనీయంగా మారింది. కరోనా అరికట్టేందుకు ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా అదుపులోకి రావడం లేదని తెలుస్తోంది.
కరోనా ప్రభావం రాష్ట్రంపై పడటంతో పినరయి విజయన్ శక్తి మించిన అప్పులు చేశారు. ప్రస్తుతం ఆ రాష్ట్రం మూడు లక్షల కోట్ల అప్పుతో నడుస్తోంది. ఇదే అదనుగా కేంద్ర ప్రభుత్వం కేరళలోని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రవేయిటీకరించేందుకు సిద్ధమైంది. ఏపీలోని విశాఖ స్టీల్ ప్లాంట్ తరహాలోని కేరళలోని బీహెచ్ఈఎల్ ను ప్రవేటీకరించేందుకు కేంద్రం దూకుడు పెంచింది. ఈక్రమంలోనే ప్రైవేటీకరణను అడ్డుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో పినరయి విజయన్ కేంద్రానికి ఎలాంటి అవకాశం లేకుండా బీహెచ్ఈఎల్ ను ఆదుకునేందుకు ముందుకురావడంపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
కేరళలోని కాసరగూడలో బీహెచ్ఈఎల్-ఎంఎల్ సంస్థ ఉంది. ఈ సంస్థలో నష్టాలను సాకుగా చూపి కేంద్ర ప్రభుత్వం దీనిని ప్రైవేటీకరణ చేసేందుకు నిర్ణయం తీసుకుంది. అయితే కేరళ సర్కారు మాత్రం కేంద్రానికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా తాజాగా ముందస్తు చర్యలను చేపట్టింది. ఈ సంస్థ కోసం దాదాపు 77కోట్ల రూపాయాలను కేరళ సర్కారు ఖర్చుచేసి తన ఆధీనంలోకి తీసుకుంది. అదేవిధంగా గడిచిన రెండేళ్లుగా ఉద్యోగులకు బకాయిపడిన దాదాపు 14కోట్ల రూపాయాలను ప్రభుత్వం ఇటీవల విడుదల చేసింది.
దీంతో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. కార్మికుల హక్కులను కాపాడుకోవడంలో కమ్యూనిస్టులు ఎప్పుడు ముందుంటారని కేరళ సర్కారు నిరూపించింది. దీంతో కేరళ దేశానికి మరోసారి ఆదర్శంగా నిలిచింది. పంతం పట్టీ మరీ పినరయి విజయన్ బీహెచ్ఈఎల్ ను కాపాడటం అభినందనీయమని పలువురు ఆయనపై ప్రశంసంలు కురిస్తున్నారు.
