IAF Chief: “F-35 దగ్గరకు కూడా రానివ్వరు.. అమ్ముతామని మాత్రం చెబుతున్నారు” .. అమెరికా పరువు తీసిన IAFచీఫ్..

  • అమెరికా F-35 యుద్ధ విమానంపై IAF చీఫ్ ఏపీ సింగ్ వ్యాఖ్యలు
  • “విమానం దగ్గరకు కూడా రానివ్వరు.. అమ్ముతామని మాట్లాడుతున్నారు” అంటూ వ్యాఖ్య
  • అమెరికా పసిఫిక్ వైమానిక దళాల కమాండర్ కెవిన్ ష్నైడర్ సమక్షంలో వ్యాఖ్యలు
Ap Singh

Ap Singh

IAF Chief:  ఇండియన్ ఎయిర్‌ఫోర్స్(IAF) చీఫ్ ఏపీ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికాకు చెందిన ఐదో తరం స్టెల్త్ యుద్ధ విమానం F-35 కొనుగోలు అంశంపై, యూఎస్ అమెరికా-పసిఫిక్ వైమానిక దళాల కమాండర్ జనరల్ కెవిన్ ష్నైడర్ ముందే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘F-35 దగ్గరగా వెళ్లేందుకు భారత అధికారుల్ని అమెరికా అనుమతించడం లేదు. అమ్ముతామని మాత్రం చెబుతున్నారు’’ అని ఏపీ సింగ్ అన్నారు.

జోధ్‌పూర్‌లో నిర్వహించిన వైమానిక విన్యాసాలు ‘తరంగ్ శక్తి-2026’ ముగింపు సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఎఫ్-35 విక్రయించేందుకు అమెరికా ఏదైనా అధికారి ప్రతిపాదన చేసిందా? అని మీడియా ప్రశ్నించిన సమయంలో ఏపీ సింగ్ మాట్లాడుతూ.. ‘‘ మీ వాళ్లు మమ్మల్ని విమానం దగ్గరకు కూడా రానివ్వరు. అలాంటి దాన్ని మాకు అమ్మడం గురించి ఏం మాట్లాడుతారు’’ అని అన్నారు.

భారత్‌కు F-35 యుద్ధ విమానాన్ని విక్రయించేందుకు అమెరికా నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రతిపాదన అందలేదని ఏపీ సింగ్ స్పష్టం చేశారు. రష్యాకు చెందిన 5వ తరం ఫైటర్ జెట్ Su-57పై కూడా ఏపీ సింగ్ కీలక వివరాలు వెల్లడించారు. ఈ విమానానికి సంబంధించి రష్యా నుంచి భారత వైమానిక దళానికి ప్రతిపాదన అందిందని చెప్పారు. దానిని పరిశీలించాలా వద్దా అనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. మరోవైపు, భారత్ తన సొంత 5వ తరం యుద్ధ విమానం అడ్వాన్స్‌డ్ మీడియం కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (AMCA) అభివృద్ధిపై కూడా దృష్టి సారిస్తోంది.