Site icon NTV Telugu

MadyaPradesh: మధ్యప్రదేశ్‌లో వ్యాపం తరహా కుంభకోణం..!.. గ్రూప్‌-2 టాపర్లలో ఏడుగురు ఒకే పరీక్ష కేంద్రంలో రాశారు..

Madyapradesh

Madyapradesh

MadyaPradesh: మధ్యప్రదేశ్‌ రాష్ట్రాన్ని వ్యాపమ్‌ కుంభకోణం కుదిపేసిన సంగతి గుర్తుంది కదా. 10 ఏళ్ల క్రితం మధ్యప్రదేశ్‌ను వ్యాపమ్‌ కుంభకోణం కుదిపేసి.. చివరకు ప్రభుత్వ పతనానికి దారితీసిన విషయం తెలిసింది. ఇటీవల జరిగిన గ్రూప్‌-2, గ్రూప్‌-4 పరీక్షల్లో కూడా వ్యాపమ్‌ తరహాలోనే కుంభకోణం జరిగినట్టు విమర్శలు వస్తున్నాయి. గ్రూప్‌-2, గ్రూప్‌-4 ఫలితాలను రాష్ర్ట ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. ఈ ఫలితాల్లో టాప్‌-10లో ఒకే పరీక్షా కేంద్రంలో రాసిన అభ్యర్థులే ఉండటం ఇందుకు కారణంగా చూపుతున్నారు. పది సంవత్సరాల క్రితం మధ్యప్రదేశ్‌ను కుదిపేసిన ‘వ్యాపమ్‌’ తరహా కుంభకోణం మళ్లీ జరిగినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇటీవల జరిగిన ఓ నియామక పరీక్షలో టాపర్లుగా నిలిచిన వారిలో ఏడుగురు ఒకే కేంద్రంలో పరీక్ష రాయడం అనుమానాలకు తావిస్తోంది. అది స్థానిక భాజపా ఎమ్మెల్యేకు చెందిన కళాశాల కావడంతో మరింత వివాదాస్పదమైంది.

Read also: Himachal Pradesh: వణికిస్తున్న భారీ వర్షాలు.. వ్యర్థాలతో పూర్తిగా నిండిన బ్రిడ్జ్..

మధ్యప్రదేశ్‌లో గ్రూప్‌-2, గ్రూప్‌-4 పట్వారీ పరీక్ష ఫలితాలను గత నెల జూన్‌ 30న విడుదల చేశారు. ఆ తర్వాత మూడు రోజులకు టాపర్లుగా నిలిచిన 10 మంది జాబితాను విడుదల చేశారు. వారిలో ఏడుగురు గ్వాలియర్‌లోని ఎన్‌ఆర్‌ఐ కాలేజీలో ఈ పరీక్ష రాసినట్లు సమాచారం. టాపర్లుగా నిలిచిన వారి రోల్‌ నంబర్లు 2488 7991 నుంచి 2488 9693 మధ్యే ఉన్నాయి. అంటే ఒకే చోట పరీక్ష రాసిన దాదాపు 1,700 మంది అభ్యర్థుల్లో ఏడుగురు టాప్‌ 10 జాబితాలో నిలిచారు. వీరు జవాబు పత్రంలో హిందీలో సంతకం చేసి.. పరీక్ష మాత్రం ఆంగ్లంలో రాసినట్లు తెలిసిందని పలు మీడియా కథనాలు వెల్లడించాయి. దీంతో ఈ పరీక్ష నిర్వహణపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరీక్ష నిర్వహించిన సంస్థను కేంద్ర ప్రభుత్వం గతంలోనే బ్లాక్‌లిస్ట్‌ చేసినందనీ, అయినప్పటికీ మధ్యప్రదేశ్‌ ఎంప్లాయిస్‌ సెలెక్షన్‌ బోర్డు.. పరీక్ష నిర్వహణ కోసం ఆ సంస్థకే టెండర్‌ అప్పగించినట్లు మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. మరోవైపు టాపర్లు రాసిన పరీక్షా కేంద్రం భాజపా ఎమ్మెల్యే సంజీవ్‌ కుశ్వాహాకు చెందినదిగా తెలుస్తోంది. దీంతో ఇది రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది. భాజపా హయాంలో మరోసారి వ్యాపమ్‌ కుంభకోణం జరిగిందని ప్రతిపక్ష కాంగ్రెస్‌ ఆరోపించింది. 2013లో భాజపా హయాంలో చోటుచేసుకున్న వ్యాపమ్‌ కుంభకోణం సంచలనం సృష్టించింది. ఈ బోర్డు ఆధ్వర్యంలో నిర్వహించిన పలు నియామక పరీక్షల్లో రాజకీయ నాయకులు, అధికారులు డబ్బు కోసం అక్రమాలకు పాల్పడ్డారని బయటపడింది. వ్యాపమ్‌ కుంభ కోణం రాష్ట్ర రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేసిన విషయం తెలిసిందే.

Exit mobile version