Wife harassment: భార్య, భార్య తరుపు బంధువులు వేధింపులతో ఇటీవల కాలంలో పురుషులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు పెరుగుతున్నాయి. తాజాగా, ముంబైకి చెందిన వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న వ్యవహారం సంచలనంగా మారింది. తన కంపెనీ వెబ్‌సైట్‌లో తన భార్య, అత్తలను నిందిస్తూ ఆయన సూసైడ్ నోట్ పోస్ట్ చేశారు. ముంబైలోని ఓ హోటల్ గదిలో 41 ఏళ్ల నిశాంత్ త్రిపాఠి ఆత్మహత్య చేసుకున్నాడు. గత శుక్రవారం సహారా హోటల్‌లోని తన గదిలో ఉరివేసుకుని మరణించాడు.
మూడు రోజుల క్రితం త్రిపాఠి చెక్ ఇన్ అయినట్లు తెలుస్తోంది. అయితే, హోటల్ సిబ్బంది తనను ‘‘డిస్టర్బ్ చేయవద్దు’’ అనే బోర్డుని డోర్‌కి ఉంచడం వల్ల, హోటల్ సిబ్బంది చాలా సేపు పట్టించుకోలేదు. అయితే, ఎంతసేపైనా స్పందన రాకపోవడంతో హోటల్ సిబ్బంది మాస్టర్ కీతో రూంలోకి వెళ్లే సరికి త్రిపాఠి మరణించి ఉన్నాడు. దీంతో పోలీసులకు హోటల్ సిబ్బంది సమాచారం అందించారు. బాధితుడి తల్లి, మహిళా హక్కుల కార్యకర్త నీలం చతుర్వేది ఫిర్యాదు ఆధారంగా, ఆత్మహత్యకు ప్రేరేపించిన భార్య అపూర్వ పారిఖ్, అత్త ప్రార్థన మిశ్రాపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Read Also: MLC Elections 2025: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన నాగబాబు!
తన కంపెనీ వెబ్‌సైట్‌లో భద్రపరిచిన సూసైడ్ నోట్‌లో తన భార్యపై ఉన్న ప్రేమను వ్యక్తం చేయడంతో పాటు తన మరణానికి మీరే కారణం అని పేర్కొన్నాడు. ‘‘నువ్వు ఇది చదివే సమయానికి నేను వెళ్లిపోతాను. నా చివరి క్షణాల్లో జరిగిన ప్రతీ దానికి నేను నిన్ను ద్వేషించగలిగే వాడిని కానీ, నేను అలా చేయలేదు. నేను ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తుంటాను. అది ఎప్పటికీ మారదు, నేను ఎదుర్కొన్న పోరాటాలన్నింటితో పాటు, నా మరణానికి నువ్వూ, ప్రార్థనా మౌసీ కూడా కారణమని మా అమ్మకు తెలుసు. కాబట్టి ఇప్పుడు ఆమెను సంప్రదించవద్దని నేను వేడుకుంటున్నాను. ఆమె చాలా బాధపడింది. ఆమెను శాంతితో దుఃఖించనివ్వండి’’ అని త్రిపాఠి సూసైడ్ నోట్‌లో పేర్కొన్నారు.
తన కొడుకు మరణం పట్ల నీలం చతుర్వేది బాధతో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. “ఈ రోజు నేను ఒక బతికి ఉన్న శవంలా అనిపిస్తున్నాను” అని అన్నారు. ‘‘ నా జీవితం ఇప్పుడు ముగిసింది. నా కొడుకు నిషాంత్ నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. నేను ఇప్పుడు సజీవ శవంగా మారిపోయాను. అతను నా అంత్యక్రియలు నిర్వహించాల్సి వచ్చింది కానీ ఈరోజు మార్చి 2న, నేను నా కొడుకు అంత్యక్రియలు చేశాను. ఈ వార్త తట్టుకునేలా నాకు, నా కూతురు ప్రాచికి ధైర్యం ఇవ్వండి’’ అని ఆమె పోస్ట్‌లో పేర్కొంది.
భార్యల వేధింపులు పెరుగుతున్న నేపథ్యంలో లింగ తటస్థ చట్టాలు రావాలని కోరుతూ ఆందోళన జరుగుతున్న సందర్భంలో ఈ సంఘటన జరిగింది. ముంబైలో త్రిపాఠి ఆత్మహత్యకు ముందు, ఆగ్రాకు చెందిన టెక్కీ కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మానవ్ శర్మ తన భార్య వేధింపుల కారణంగా మరణించాడు. బెంగళూర్‌కి చెందిన అతుల్ సుభాష్ ఆత్మహత్య కూడా దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.