అస్సామీ గాయకుడు జుబీన్ గార్గ్ మరణం అస్సామీయులనే కాకుండా యావత్తు దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన మరణ వార్త తెలియగానే లక్షలాది మంది అభిమానులు కన్నీటి పర్యంతం అయ్యారు. అయితే ఆకస్మిక మరణం పలు అనుమానాలకు దారి తీసింది. జుబీన్ గార్గ్ మరణంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ అస్సాంలో 60 ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయి. ఇక రాష్ట్ర ప్రభుత్వం కూడా సీరియస్‌గా తీసుకుని సిట్ విచారణకు ఆదేశించింది. ఇక దర్యాప్తులో విస్తుగొల్పే విషయాలు వెలుగులోకి వచ్చాయి. జుబీన్ గార్గ్‌పై విష ప్రయోగం జరిగినట్లుగా ఆరోపణలు వచ్చాయి. జుబీన్ గార్గ్ మేనేజర్ సిద్ధార్థ్ శర్మ విష ప్రయోగం చేసినట్లుగా ఆరోపణలు రావడంతో ప్రాథమిక రిపోర్టులో దోషిగా తేల్చింది.
తాజాగా మరో కీలక విషయం బయటకు వచ్చింది. జుబీన్ గార్గ్‌కు చెందిన మరో బ్యాండ్‌మేట్ పార్థ ప్రతిమ్ గోస్వామి సంచలన ఆరోపణలు చేశారు. మేనేజర్ సిద్ధార్థ్ శర్మ, తోటి సంగీతకారుడు శేఖర్ జ్యోతి గోస్వామి కారణంగానే జుబీన్ గార్గ్ చనిపోయినట్లు తెలిపారు. హోటల్‌లో రాత్రంతా మందు పార్టీ చేసుకున్నారని.. కనీసం జుబీన్ గార్గ్‌ను నిద్రపోనివ్వకుండా చేశారని ఆరోపించారు. విశ్రాంతి తీసుకోకుండానే.. అంతంలోనే విహారయాత్రకు తీసుకెళ్లారని.. జుబీన్ గార్గ్‌కు మూర్ఛ వ్యాధి ఉందన్న స్పృహ లేకుండా ఈతకొట్టేందుకు ఉసిగొల్పారని పార్థ ప్రతిమ్ గోస్వామి చెప్పుకొచ్చాడు. అత్యంత నిర్లక్ష్యం, అజాగ్రత్త కారణంగానే జుబీన్ గార్గ్ చనిపోయారని తెలిపాడు. ఈ నిర్లక్ష్యపు తప్పును ఎప్పటికీ క్షమించబోను అన్నారు.
ప్రస్తుతం ఈ కేసులో నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. మేనేజర్ సిద్ధార్థ్ శర్మ, ఈవెంట్ నిర్వాహకుడు శ్యామ్‌కాను మహంత, బ్యాండ్‌మేట్ శేఖర్ జ్యోతి గోస్వామి, కో-సింగర్ అమృత్‌ప్రవ మహంతను అరెస్ట్ చేశారు. వీరిపై హత్య అభియోగాలు నమోదు చేశారు. ఇక ఆదివారం ఇద్దరు ప్రముఖులను సిట్ విచారించింది. నటి వైశాలి మేధి, గాయని మేఘనా బోర్పుజారిలను ప్రశ్నించింది. కీలక సమాచారాన్ని రాబట్టింది.
ఇది కూడా చదవండి: Israel-Hamas: నేడు ఈజిప్టు వేదికగా హమాస్-ఇజ్రాయెల్ కీలక చర్చలు.. బందీల విడుదలపై వీడనున్న ఉత్కంఠ
ఇదిలా ఉంటే సిట్ దర్యాప్తులో శేఖర్ జ్యోతి గోస్వామి ఇటీవల కీలక సమాచారాన్ని పంచుకున్నాడు. సింగపూర్‌లోని పాన్ పసిఫిక్ హోటల్‌లో జుబీన్ గార్గ్‌తో సిద్ధార్థ్ శర్మ వింతగా ప్రవర్తించాడని.. రాత్రంతా మందు పార్టీలో ఉన్నారని.. ఉదయాన్నే మళ్లీ విహారయాత్రకు తీసుకెళ్లాడని ఆరోపించాడు. ఇక సముద్రంలో బోటును బలవంతంగా నావికుడి నుంచి ఆధీనంలోకి తీసుకున్నాడని.. అప్పుడు తీవ్ర అలజడి రేగినట్లు చెప్పాడు. ఇక జుబీన్ గార్గ్‌కు ఎలాంటి ఆహార పదార్థాలు ఇవ్వొద్దని చెప్పి.. అతడే పానీయాలు అందజేశాడని వివరించాడు. ఆ సమయంలోనే విష ప్రయోగం జరిగిందని పేర్కొన్నాడు. ఇక ఈత కొడుతున్న సమయంలో కూడా ఎవరిని దగ్గరకు వెళ్లనివ్వలేదని.. అంతేకాకుండా వీడియోలు కూడా ఎవరితోనూ పంచుకోవద్దని మేనేజర్ సూచించాడని తెలిపాడు. జుబీన్ గార్గ్ మంచి ఈతగాడు అని.. మునిగి చనిపోలేదని.. అతడి నోటిలో నురుగు కనిపించిందని వివరించాడు.
ఇది కూడా చదవండి: Jaipur: జైపూర్ ఆస్పత్రిలో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది రోగులు మృతి
ఇదిలా ఉంటే అక్టోబర్ 10న జుబీన్ గార్గ్ మరణంపై విసెరా నివేదిక రానున్నట్లు ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ తెలిపారు. సాక్షులు వాంగ్మూలంలో ఏదైనా చెప్పవచ్చు.. కానీ నివేదిక వచ్చాక అసలు విషయం బయటపడుతుందని చెప్పారు. అక్టోబర్ 11 నాటికి అన్ని అనుమానాలకు సమాధానాలు దొరకుతాయని పేర్కొన్నారు.
జుబీన్ గార్గ్ (52) సింగపూర్‌లోని నార్త్ ఈస్ట్ ఇండియా ఫెస్టివల్‌కు వెళ్లారు. సెప్టెంబర్ 19న సముద్రంలో ఈత కొడుతూ ప్రాణాలు కోల్పోయారు. జుబీన్ గార్గ్ మరణంపై అనేక అనుమానాలు రేకెత్తాయి. అస్సాంలో 60కి పైగా ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయి. ప్రస్తుతం సిట్ దర్యాప్తు కొనసాగిస్తోంది.
