Site icon NTV Telugu

స్వర్ణదేవాలయంలో ఆగంతకుడు.. కోపంతో భక్తులు కొట్టిచంపారు..

పంజాబ్‌ అమృతసర్‌లోని స్వర్ణ మందిరంలో ఓ ఆగంతకుడు చొరబడ్డాడు. గురుగ్రంథ్‌ సాహిబ్‌ను అపవిత్రం చేసేందుకు ఆగంతకుడు ప్రయత్నించగా వెంటనే గుర్తించిన ఎస్‌జీపీసీ సిబ్బంది దుండగిని పట్టుకున్నారు. అయితే సాయంత్రం 6 గంటలకు ప్రార్థనలు చేసే సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనపై ఎస్‌జీపీసీ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. అయితే అప్పటికే ఆగ్రహంతో రగిలిపోతున్న భక్తులు ఒక్కసారిగా ఆ దుండగుడిపై దాడి చేశారు. దీంతో ఆ వ్యక్తి మరణించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దుండగుడి మృతదేహాన్ని అమృత్‌సర్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ ఘటనపై అమృత్‌సర్‌ డీఎస్పీ మాట్లాడుతూ.. ఆగంతకుడికి 20 నుంచి 25 ఏళ్ల వయసు ఉంటుందని, రేపు శవపరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా ఆగంతకుడు ఎవరు, ఎక్కడినుంచి వచ్చాడనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామన్నారు. సీసీ కెమెరాల దృశ్యాలు కూడా పరిశీలిస్తున్నామని, ఘటనపై భక్తులు, ప్రజలు సంయమనం పాటించాలని ఆయన అన్నారు.

Exit mobile version