Amit Shah-Om Birla: లోక్‌సభ స్పీకర్‌కు అమిత్ షా లేఖ.. దేనికోసమంటే..!

  • నీట్ లీక్ వ్యవహారంపై పార్లమెంట్‌లో రగడ
  • స్పీకర్ ఓం బిర్లాకు అమిత్ షా లేఖ
  • ఎంత సమయమైనా కేటాయించాలని లేఖ
Amitshah

Amitshah

నీట్ పరీక్ష వ్యవహారం పార్లమెంట్ ఉభయ సభలను కుదిపేస్తోంది. పేపర్ లీక్‌పై చర్చ చేపట్టాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా లేఖ రాశారు. నీట్ పేపర్ లీక్‌పై చర్చకు సిద్ధమని.. చర్చకు ఎంత సమయం కావాలంటే అంత సమయం కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్‌లో జరిగే చర్చలో తాను స్వయంగా పాల్గొని ప్రతిపక్ష సభ్యులు లేవనెత్తే ప్రశ్నలకు సమాధానం ఇస్తానని తెలిపారు. చర్చకు ఎన్ని గంటలు లేదా ఎన్ని రోజులు సమయం కేటాయించాలనే విషయాన్ని ప్రతిపక్షంతో సంప్రదించి పరస్పర అంగీకారంతో నిర్ణయించాలని స్పీకర్‌ను కోరారు.

పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ప్రభుత్వ తరఫున నీట్ అంశంపై చర్చకు అంగీకరించిన విషయాన్ని బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో ప్రస్తావించినట్లు అమిత్ షా తన లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో ‘Public Examinations (Prevention of Unfair Means) Amendment Bill, 2026’ను ఇప్పటికే చర్చకు తీసుకున్నామని గుర్తుచేశారు. అయితే ఆ బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో ప్రతిపక్ష సభ్యులు ఎవరూ నీట్ పరీక్ష అంశాన్ని లేవనెత్తలేదని తెలిపారు. అయినప్పటికీ ఈ అంశంపై మరోసారి చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.

పార్లమెంట్ వెలుపల బుధవారం మీడియాతో మాట్లాడిన అమిత్ షా.. ఏ అంశంపైనైనా చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. అయితే ప్రతిపక్షం సభ కార్యకలాపాలను అడ్డుకుంటోందని ఆరోపించారు. ప్రభుత్వం దాచాల్సిందేమీ లేదని, పార్లమెంట్‌లో ప్రతి ప్రశ్నకు సమాధానం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. అయితే పార్లమెంట్‌లో చర్చకు కొన్ని నిబంధనలు ఉంటాయని, కేవలం ప్రకటన చేసి వెళ్లిపోవడం ద్వారా చర్చ జరగదని స్పష్టం చేశారు.

బుధవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి అర్ధరాత్రి వరకు, అవసరమైతే గురువారం మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా నీట్ అంశంపై చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని అమిత్ షా తెలిపారు. దేశ ప్రజల ముందు అన్ని విషయాలు స్పష్టమయ్యేలా ప్రతిపక్షం అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం ఇస్తానని చెప్పారు. పార్లమెంట్‌కు తాను దూరంగా ఉంటున్నానన్న ఆరోపణలను కూడా ఖండించారు. సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి తాను క్రమం తప్పకుండా సభకు హాజరవుతున్నానని, అయితే సభలో గందరగోళం కారణంగా చర్చల్లో పాల్గొనే అవకాశం రాలేదని తెలిపారు. నీట్ విద్యార్థుల ఆందోళనలపై సమగ్ర చర్చకు ప్రభుత్వం ఇప్పటికే అంగీకరించిందని, ఇప్పుడు చర్చకు సమయాన్ని నిర్ణయించడమే మిగిలిందని పేర్కొన్నారు.

రాహుల్ గాంధీ కౌంటర్

మరోవైపు కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అమిత్ షా వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. అమిత్ షా నుంచి ఎలాంటి ఉపన్యాసం వినేందుకు తాము ఆసక్తిగా లేమని అన్నారు. విద్యార్థుల నిరసనల సమయంలో పెల్లెట్ గన్స్ వినియోగించిన అంశాన్ని ప్రస్తావించారు. వాటిని ప్రయోగించేందుకు అనుమతి ఎవరు ఇచ్చారో అమిత్ షా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పెల్లెట్ గన్స్ వినియోగానికి ఆదేశాలు స్వయంగా అమిత్ షా ఇచ్చి ఉంటే ఆయన రాజీనామా చేయాలని, ఒకవేళ తాను ఆదేశించలేదంటే హోంమంత్రిగా అసమర్థతకు బాధ్యత వహించి పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్‌లో అమిత్ షా తన హాజరు గురించి మాట్లాడటంపైనా రాహుల్ స్పందించారు. బుధవారం ఆయన సభకు వచ్చారా లేదా అన్నది తమకు ప్రధాన అంశం కాదని, గత 20 రోజులుగా ఆయన సభకు ఎందుకు దూరంగా ఉన్నారన్నదే తమ ప్రశ్న అని అన్నారు.