కేంద్ర హోంమంత్రి అమిత్ షా గురువారం తమిళనాడులో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా రేపు అమిత్ షా అధ్యక్షతన 31వ దక్షిణాది ప్రాంతీయ మండలి సమావేశం తమిళనాడులోని మామల్లపురంలో జరగనుంది. దక్షిణాది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లు, అడ్మినిస్ట్రేటర్లు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. కేంద్ర హోంశాఖ బుధవారం ఈ విషయాన్ని వెల్లడించింది.
ఏయే రాష్ట్రాలు పాల్గొంటాయి?
దక్షిణాది ప్రాంతీయ మండలిలో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలు ఉన్నాయి. అలాగే పుదుచ్చేరి, అండమాన్-నికోబార్ దీవులు, లక్షద్వీప్ కేంద్ర పాలిత ప్రాంతాలు సభ్యులుగా ఉన్నాయి. ఈ ప్రాంతీయ మండలి సమావేశాల్లో కేంద్రం, రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలు, రెండు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు సంబంధించిన వివాదాలు, జాతీయ ప్రాధాన్యం ఉన్న అంశాలపై చర్చిస్తారు.
నదీ జలాల వివాదాలపై చర్చ?
ఈసారి సమావేశంలో పలు కీలక అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా కర్ణాటక-తమిళనాడు మధ్య నదీ జలాల పంపకం, తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ మధ్య నీటి వివాదాలు, తమిళనాడు-కేరళ మధ్య జలాల అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, నీటి పంపకం, ప్రధానమంత్రి ఆవాస్ యోజన (గ్రామీణ్), పౌర విమానయానానికి సంబంధించిన అంశాలు కూడా చర్చించనున్నట్లు కేంద్రం తెలిపింది.
సీఎంలతో పాటు మంత్రులు కూడా..
సమావేశానికి దక్షిణాది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లు, అడ్మినిస్ట్రేటర్లు హాజరవుతారు. ప్రతి రాష్ట్రం నుంచి ఇద్దరు సీనియర్ మంత్రులు కూడా పాల్గొంటారు. ఆయా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, సలహాదారులు, ఇతర ఉన్నతాధికారులతో పాటు కేంద్ర ప్రభుత్వానికి చెందిన సీనియర్ అధికారులు కూడా సమావేశంలో పాల్గొననున్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఇప్పటికే గురువారం తమిళనాడుకు వెళ్లి దక్షిణాది ప్రాంతీయ మండలి సమావేశంలో పాల్గొంటానని వెల్లడించారు. ఇక అమిత్ షా బుధవారం రాత్రి తమిళనాడుకు చేరుకుని మామల్లపురం సమీపంలోని కోవళంలో బస చేయనున్నట్లు సమాచారం.
మహిళలు, చిన్నారులపై నేరాలపై కూడా చర్చ
జాతీయ ప్రాధాన్యం ఉన్న అంశాల్లో భాగంగా మహిళలు, చిన్నారులపై నేరాలకు సంబంధించిన కేసుల వేగవంతమైన దర్యాప్తు, పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టులు తదితర అంశాలు కూడా చర్చకు రానున్నాయి. విద్యకు సంబంధించిన అంశాలపైనా చర్చ జరగనుంది. దక్షిణాది ప్రాంతీయ మండలి సలహా స్వభావం కలిగిన సంస్థ అయినప్పటికీ.. కేంద్రం, రాష్ట్రాల మధ్య పరస్పర అవగాహన, సహకారాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తోందని కేంద్రం పేర్కొంది. ప్రధాని మోడీ ప్రతిపాదించిన ‘టీమ్ భారత్’, సహకార సమాఖ్య విధానాన్ని బలోపేతం చేయడంలో జోనల్ కౌన్సిళ్లు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయని తెలిపింది. బలమైన రాష్ట్రాలతోనే బలమైన దేశం నిర్మాణమవుతుందనే భావనతో ఇవి పనిచేస్తాయని వివరించింది.
12 ఏళ్లలో 69 సమావేశాలు
2014 జూన్ నుంచి ఇప్పటివరకు సుమారు 12 ఏళ్ల కాలంలో వివిధ జోనల్ కౌన్సిళ్లు, వాటి స్టాండింగ్ కమిటీలకు సంబంధించి 69 సమావేశాలు నిర్వహించినట్లు కేంద్రం వెల్లడించింది. జోనల్ కౌన్సిల్‌లో ప్రధాన కార్యదర్శుల స్థాయిలో స్టాండింగ్ కమిటీ కూడా ఉంటుంది. రాష్ట్రాలు ప్రతిపాదించిన అంశాలను తొలుత ఈ కమిటీ పరిశీలిస్తుంది. అక్కడ చర్చించిన తర్వాత పరిష్కారం కాని అంశాలను జోనల్ కౌన్సిల్ సమావేశంలో చర్చకు తీసుకువస్తారు.
స్టేట్స్ రీఆర్గనైజేషన్ యాక్ట్-1956లోని 15 నుంచి 22 సెక్షన్ల కింద ఐదు జోనల్ కౌన్సిళ్లను ఏర్పాటు చేశారు. దక్షిణాది ప్రాంతీయ మండలికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. సభ్య రాష్ట్రాల ముఖ్యమంత్రులు రొటేషన్ పద్ధతిలో వైస్ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. ప్రస్తుతం తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ వైస్ చైర్మన్‌గా ఉన్నారు. ఈ 31వ సమావేశాన్ని కేంద్ర హోంశాఖకు చెందిన ఇంటర్-స్టేట్ కౌన్సిల్ సెక్రటేరియట్ నిర్వహిస్తుండగా.. తమిళనాడు ప్రభుత్వం ఆతిథ్యం ఇస్తోంది.

