F-35 Stealth Fighters: ప్రధాని నరేంద్రమోడీ అమెరికా పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. డొనాల్డ్ ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ అయిన తర్వాత, ఆయనను కలిసిన అతికొద్ది మంది ప్రపంచ నాయకుల్లో మోడీ ఒకరు. అమెరికా పర్యటనలో ఉన్న మోడీకి వైట్ హౌజ్‌లో ట్రంప్ ఘన స్వాగతం పలికారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం, వివిధ రంగాల్లో ఒప్పందాలు చేసుకున్నారు. ఇరువురు నేతలు సంయుక్త మీడియా సమావేశంలో పాల్గొన్నారు.
అమెరికా భారత్ తమ వాణిజ్య బంధాన్ని మరింత పెంచుకుటామని చెప్పాయి. అంతకుముందు ప్రధాని మోడీ నాకన్నా అత్యంత కఠినమైన సంధానకర్తగా ట్రంప్ అభివర్ణించారు. ఇదిలా ఉంటే, అమెరికా తన అత్యుత్తమ యుద్ధవిమానం F-35 స్టెల్త్ ఫైటర్ జెట్లను భారత్‌కి అమ్మేందుకు ముందుకు వచ్చింది. “ఈ సంవత్సరం నుండి, మేము భారతదేశానికి సైనిక అమ్మకాలను అనేక బిలియన్ డాలర్లకు పెంచుతాము” అని ట్రంప్ అన్నారు. ‘‘చివరకు మేము భారతదేశానికి F-35 స్టీల్త్ ఫైటర్లను అందించడానికి కూడా మేము మార్గం సుగమం చేస్తున్నాము’’ అని ట్రంప్ చెప్పారు.
భారత్‌లో అమెరికా గొప్ప ట్రేడ్ డీల్‌ని సెట్ చేస్తోందని ట్రంప్ వెల్లించారు. వాణిజ్య ఒప్పందంపై రెండు దేశాలు కలిసి పనిచేస్తాయని మోడీ కూడా చెప్పారు. భారతదేశ ఇంధన భద్రతను నిర్ధారించడానికి, మేము చమురు మరియు గ్యాస్ వాణిజ్యంపై దృష్టి పెడతామని మోడీ వెల్లడించారు.