NTV Telugu Site icon

Blinkit: అంబులెన్స్ సేవలు ప్రారంభించిన బ్లింకిట్.. కాల్ చేసిన టెన్ మినిట్స్‌లోనే..!

Blinkit

Blinkit

నూతన సంవత్సరం వేళ జొమాటోకు చెందిన బ్లింకిట్ మరో కొత్త సేవను ప్రారంభించింది. గురుగ్రామ్‌లో బ్లింకిట్ అంబులెన్స్ సేవలను ప్రారంభించినట్లు సీఈవో అల్బిందర్ ధిండ్సా‌ ఎక్స్‌లో పేర్కొన్నారు. కేవలం 10 నిమిషాల్లోనే అంబులెన్స్ సేవలు అందుతాయని పేర్కొన్నారు. గురువారం ఐదు అంబులెన్స్ సేవలను ప్రారంభించినట్లు వెల్లడించారు. సిబ్బందితో కూడిన ఫొటోలను ఎక్స్‌లో పోస్టు చేశారు.

ఇప్పటి వరకు బ్లింకిట్ రోజువారీ నిత్యవసర వస్తువులను సరఫరా చేసేది. బ్యూటీ ప్రొడక్ట్స్, పెంపుడు జంతువుల సంరక్షణ, పిల్లల సంరక్షణ వస్తువులు, ఆహారాన్ని అందించేది. తాజాగా కొత్త రంగంలోకి అడుగుపెట్టింది. 10 నిమిషాల్లో రోగి ఇంటికి చేరుకునే అంబులెన్స్ సేవలను ప్రారంభించింది.

తొలిరోజు ఐదు అంబులెన్స్‌లు రోడ్డెక్కాయి. త్వరలో సేవలను మరింత విస్తరింపజేస్తామని కంపెనీ తెలిపింది. బ్లింకిట్ యాప్ ద్వారా.. అంబులెన్స్ సేవలను బుక్ చేసుకునే సదుపాయాన్ని కల్పించింది. త్వరలోనే దేశంలోనే ప్రధాన నగరాల్లో అంబులెన్స్ సేవలు విస్తరింపజేస్తామని సీఈవో తెలిపారు. ప్రజలు విశ్వసించే విధంగా సేవలు అందిస్తామని చెప్పారు.

బ్లింకిట్ అంబులెన్స్‌లో ఆక్సిజన్ సిలిండర్లు, AED (ఆటోమేటెడ్ ఎక్స్‌టర్నల్ డీఫిబ్రిలేటర్), స్ట్రెచర్, మానిటర్, ఆస్పిరేటర్ యంత్రం, అవసరమైన అత్యవసర మందులు, ఇంజెక్షన్‌లతో సహా అవసరమైన ప్రాణాలను రక్షించే పరికరాలు ఉంటాయి. ప్రతి అంబులెన్స్‌లో పారామెడిక్, సహాయకుడు, శిక్షణ పొందిన డ్రైవర్‌లు నాణ్యమైన సేవను అందిస్తారని తెలిపింది.

ఈ సేవలు లాభాల కోసం కాదని.. కేవలం వినియోగదారులకు సరసమైన ధరకి నాణ్యమైన సేవలు అందించాలన్న లక్ష్యంతోనే చేపట్టినట్లు స్టార్టప్ వ్యవస్థాపకుడు పేర్కొన్నారు. రాబోయే రెండేళ్లలో అన్ని ప్రధాన నగరాల్లో సేవలు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. అంబులెన్స్‌లు రోగులకు సేవలు అందించేటప్పుడు మార్గం కల్పించాలని ప్రజలకు ధిండ్సా విజ్ఞప్తి చేశారు.

Show comments