NTV Telugu Site icon

Amazon India: అమెజాన్ మరో సంచలన నిర్ణయం.. వారంలో మూడోది బంద్

Amazon Wholesale Distributi

Amazon Wholesale Distributi

Amazon Shutting Down Wholesale Distribution In India: ప్రముఖ ఇ-కామర్స్‌ సంస్థ అమెజాన్ ఈమధ్య ఒకదాని తర్వాత మరొక ఝలక్‌లు ఇస్తోంది. వ్యయ నియంత్రణపై దృష్టి సారించిన అమెజాన్.. తొలుత భారీ ఎత్తున ఉద్యోగులను తొలగించింది. ఇప్పటికీ ఆ ప్రాసెస్ కొనసాగించిన ఈ సంస్థ.. ఈ క్రమంలోనే ఎడ్యుటెక్‌, ఫుడ్‌ డెలివరీ వ్యాపారాలను మూసివేయనున్నట్లు బాంబ్ పేల్చింది. ఈ ప్రకటన ఇచ్చిన వారం వ్యవధిలోనే.. మూడో దుకాణం ఎత్తేయడానికి కూడా సిద్ధమైంది. అవును.. భారత్‌లో హోల్‌సేల్‌ డిస్ట్రిబ్యూషన్‌ వ్యాపారాన్ని మూసివేస్తున్నట్లు అమెజాన్ తాజాగా ప్రకటించింది. ఎడ్యుటెక్‌ మూసివేతపై నవంబరు 24న, ఫుడ్‌ డెలివరీపై నవంబరు 25న ప్రకటనలు చేసిన అమెజాన్.. లేటెస్ట్‌గా హోల్‌సేల్‌ డిస్ట్రిబ్యూషన్‌ వ్యాపారాన్ని నిలిపివేస్తున్నట్టు కుండబద్దలు కొట్టింది.

అమెజాన్‌ సంస్థ ఈ హోల్‌సేల్‌ డిస్ట్రిబ్యూషన్‌‌ను బెంగళూరు, మైసూరు, హుబ్లీ నగరాల్లో ప్రధానంగా నిర్వహిస్తోంది. చిరు వ్యాపారులు ఈ వెబ్‌సైట్ ద్వారా ఉత్పత్తులను హోల్‌సేల్ ధరలకే కొనుగోలు చేసుకోవడానికి వీలుండేది. అయితే.. ఇప్పుడు ఈ వ్యాపారాన్ని మూసివేస్తున్నట్లు అమెజాన్‌ ప్రకటించింది కాబట్టి, ఇన్నాళ్లూ దీనిపై ఆధారపడిన చిన్న వ్యాపారులకు పెద్ద దెబ్బ పడినట్టే. తామేమీ ఈ నిర్ణయాలను అనాలోచితంగా తీసుకోవడం లేదని.. ప్రస్తుత కస్టమర్లు, భాగస్వాములను దృష్టిలో పెట్టుకుని ఈ కార్యకలాపాలను దశలవారీగా నిలిపివేస్తామని అమెజాన్ సంస్థ పేర్కొంది. అంతేకాదు.. ఈ మూసివేతల కారణంగా ప్రభావితమయ్యే ఉద్యోగులకు తాము అండగా ఉంటామని.. తమ కస్టమర్లకు అత్యుత్తమ ఆన్‌లైన్‌ షాపింగ్‌ సేవలను అందించడంపై తాము పూర్తిగా దృష్టి సారించామని వెల్లడించింది.

కాగా.. కరోనా మహమ్మారి సమయంలో హోం డెలివరీ సేవలతో పాటు ఆన్‌లైన్ లెర్నింగ్‌కు భారీగా డిమాండ్ పెరిగింది. దాన్ని క్యాష్ చేసుకునేందుకు అమెజాన్ సంస్థ అమెజాన్ ఫుడ్ పేరుతో ‘అమెజాన్‌ ఫుడ్‌’ పేరుతో ఆహార డెలివరీతో పాటు అమెజాన్‌ అకాడమీ సేవల్ని ప్రారంభించింది. అయితే.. ఫుడ్ డెలివరీ విభాగంలో డంజో, ఊబర్ ఈట్స్‌తో పాటు ఇటర స్టార్టప్‌లు రావడంతో.. అమెజాన్ ఫుడ్‌కి ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదు. అటు, విద్యా సంస్థలు కూడా యాథావిధిగా నడుస్తుండడంతో, ఆన్‌లైన్ లెర్నింగ్ అవసరం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలోనే ఈ రెండు వ్యాపారాల్ని మూసివేయాలని అమెజాన్ నిర్ణయించింది.