Site icon NTV Telugu

Amarnath Yatra: భక్తులకు గుడ్ న్యూస్.. అమర్‌నాథ్ యాత్ర తేదీలు ఖరారు

దేశవ్యాప్తంగా ఉన్న ప్రసిద్ధి చెందిన శైవ క్షేత్రాల్లో అమర్‌నాథ్ ఒకటి. హిమాలయాల్లో కొలువుదీరే ఈ మంచు లింగాన్ని దర్శించుకునేందుకు ఏటా లక్షల మంది భక్తులు తరలి వెళ్తుంటారు. వేసవిలో తప్ప మిగతా సమయంలో ఇక్కడ మంచు కప్పబడి ఉంటుంది. దీంతో వేసవిలో కొన్ని రోజులు మాత్రమే ఇక్కడి మంచులింగాన్ని దర్శించుకునే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో అమర్‌నాథ్ యాత్ర కోసం భక్తులు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు.

ఈ క్రమంలో పరమేశ్వరుడి భక్తుల నిరీక్షణకు తెరదించుతూ ఈ ఏడాది అమర్నాథ్ యాత్రకు సంబంధించిన తేదీలను అధికారులు ప్రకటించారు. జూన్ 30న అమర్ నాథ్ యాత్ర ప్రారంభం కానుంది. ఈ యాత్ర 43 రోజుల పాటు కొనసాగనుంది. సంప్రదాయం ప్రకారం రక్షాబంధన్ రోజున యాత్ర ముగియనుంది. జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా అధ్యక్షతన ఆదివారం జరిగిన అమర్‌నాథ్ బోర్డు సమావేశంలో యాత్రకు సంబంధించిన తేదీలను అధికారులు నిర్ణయించారు.

కాగా 2019లో జమ్మూ కాశ్మీర్కు స్వయం ప్రతిపత్తి రద్దు చేసిన నేపథ్యంలో ఆ ఏడాది అమర్ నాథ్ యాత్ర అర్థాంతరంగా ముగిసింది. కరోనా మహమ్మారి కారణంగా 2020, 2021లో యాత్రికులను అనుమతించలేదు. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడంతో ఈ ఏడాది కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అమర్‌నాథ్ యాత్ర నిర్వహించాలని బోర్డు నిర్ణయించింది.

https://ntvtelugu.com/central-government-lifts-covid-restrictions-on-international-flights/
Exit mobile version