Site icon NTV Telugu

Akshay Kumar: కారు యాడ్‌పై విమర్శలు.. వరకట్నాన్ని ప్రోత్సాహించేలా ఉందంటూ..

Akshay Road Safety Ad

Akshay Road Safety Ad

Akshay Kumar Road Safety Ad Lands In Trouble: ఇటీవల ప్రముఖ పారిశ్రామికవేత్త సైరస్ మిస్త్రీ రోడ్డు ప్రమాదంలో మరణించడంతో.. ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు ఒక యాడ్‌ఫిల్మ్ రూపొందించారు. బాలీవుడ్ ప్రముఖ నటుడు అక్షయ్ కుమార్ నటించిన ఈ యాడ్‌లో.. కారులో రెండు కంటే ఆరు ఎయిర్ బ్యాగులుంటే చాలా సురక్షితమని సందేశం ఇచ్చారు. దీనిని కేంద్రమంత్రి నితిన్ గడ్కరి ట్విటర్‌లో షేర్ చేశారు. కారులో ఆరు బ్యాగులు ఉండాలన్న సందేశం మంచిదే కానీ, దానికోసం ఎంచుకున్న అంశమే తేడా కొట్టేసింది. దీంతో ఈ యాడ్ వివాదాస్పదమైంది. వరకట్నాన్ని ప్రోత్సాహించేలా ఉందంటూ నెటిజన్లు విమర్శలు చేయడం మొదలుపెట్టేశారు.

అసలు ఆ యాడ్‌లో ఏముందంటే.. పెళ్లైన తర్వాత అత్తారింటికి వెళ్లేందుకు వధువు కారులో కూర్చుంటుంది. అయితే.. తల్లిదండ్రులు వదిలి వెళ్తున్నానన్న బాధలో వారిని చూస్తూ ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు వధువు తండ్రి పక్కనే ఉన్న అక్షయ్ కుమార్.. ‘ఇలాంటి కారులో పంపిస్తే కూతరు ఏడ్వకుండా ఉంటుందా?’ అని అంటాడు. ‘ఆ కారుకి ఏమైంది? అది ఆటోమెటిక్ కారు, సన్ రూఫ్ ఉంది, మ్యూజిక్ సిస్టమ్ కూడా ఉంది’ అని వధువు తండ్రి చెప్తాడు. ‘కానీ ఎయిర్ బ్యాగ్స్ కేవలం రెండే ఉన్నాయిగా’ అంటాడు అక్షయ్. ఆ మాట వినగానే కారులో నుంచి వధువు, వరుడు వెంటనే దిగిపోతారు. ఆరు ఎయిర్ బ్యాగులున్న కారు సురక్షితమని అక్షయ్ చెప్పగానే.. వెనుక నుండి రయ్యున అంటూ ఒక కారు వచ్చేస్తుంది. అది ఎక్క కొత్త జంట ఆనందంగా వెళ్లిపోతుంది.

ఈ యాడ్ ఉద్దేశం మంచిదే కానీ.. చూడ్డానికి ఇది వరకట్నాన్ని ప్రోత్సాహించేలా ఉందని కొందరు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమ్మాయికి పెళ్లి చేసిన తర్వాత, ఖరీదైన కార్లను వరకట్నం కింద కొనిచ్చి పంపండని అనేలా ఆ యాడ్ ఉందని మండిపడుతున్నారు. అంతేకాదు.. రహదారుల లోపాల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని, వాటిని సరి చేయకుండా ఇలా ఆరు ఎయిర్ బ్యాగులున్న ఖరీదైన వాహనాల్లో వెళ్లమని చెప్పడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఈ యాడ్ మీద శివసేన నాయకురాలు ప్రియాంకా చతుర్వేది, టీఎంసీ జాతీయ అధికార ప్రతినిధి సాకేత్ గోఖలే వంటి వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Exit mobile version