Bharat Jodo Nyay Yatra: కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో జరుగుతున్న ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇండియా కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ), కాంగ్రెస్ మధ్య పొత్తు కుదరడంతో ఆ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఈ రోజు జోడో యాత్రలో రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీతో కలిసి పాల్గొన్నారు. ఉత్తర్ ప్రదేశ్ ఆగ్రా మీదుగా సాగుతున్న యాత్రలో అఖిలేష్ యాదవ్ చేరారు. రెండు పార్టీల నడుమ గత కొన్ని నెలులగా సీట్ల షేరింగ్ గురించి చర్చలు నడుస్తున్నాయి. తాజాగా పొత్తు ఖరారైంది. దీంతో అఖిలేష్ యాదవ్ యాత్రలో పాల్గొన్నారు.
Read Also: Maratha quota: “నన్ను చంపేందుకు కుట్ర”.. ఫడ్నవీస్‌పై మరాఠా కోటా కార్యకర్త సంచలన వ్యాఖ్యలు..
కాంగ్రెస్‌తో సీట్ల పంపకం పూర్తైతేనే తాను యాత్రలో పాల్గొంటానని, వారం రోజులుగా యాత్రలో చేరేందుకు అఖిలేష్ నిరాకరించారు. ఆదివారం, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ సమాజ్ పార్టీ చీఫ్‌ని యాత్రలోని ఆహ్వానిస్తూ.. ఈ రోజు చాలా సంతోషకరమైన రోజు అని అన్నారు. రాబోయే రోజుల్లో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడటం, బీజేపీ నాశనం చేసిన బీఆర్ అంబేద్కర్ కలల్ని నెరవేర్చడం అతిపెద్ద సవాల్ అని అఖిలేష్ యాదవ్ అన్నారు. ‘‘బీజేపీ హటావో, దేశ్ కో బచావో, సంకట్ మిటావో(బీజేపీని తొలగించండి, దేశాన్ని రక్షించండి మరియు సంక్షోభాన్ని అంతం చేయండి)’’ అంటూ పిలుపునిచ్చాడు. రాబోయే రోజుల్లో బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎను ఓడించేందుకు భారత కూటమి, పిడిఎ (పిచ్రే, దళిత మరియు అల్పశంఖక్) పనిచేస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఉత్తర్ ప్రదేశ్ లోని 80 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి 17 స్థానాలు ఇచ్చేందుకు ఎస్పీ ఒప్పుకుంది. మిగిలిన సీట్లలో ఎస్పీ తన మిత్రపక్షాలతో కలిసి పోటీ చేయనుంది. 2014 ఎన్నికల్లో బీజేపీకి ఈ రాష్ట్రం నుంచి 71 సీట్లు రాగా.. 2019లో ఓట్ల శాతం పెరిగినప్పటికీ, 62 సీట్లు మాత్రమే వచ్చాయి. కేంద్రంలో అధికారంలోకి రావాలంటే ఉత్తర్ ప్రదేశ్ కీలకమైన రాష్ట్రం కావడంతో బీజేపీతో పాటు ఇండియా కూటమి ఈ రాష్ట్రంపై దృష్టి సారించాయి.