Air India Flight Emergency Landing: ఇటీవల వరసగా భారత విమానయాన సంస్థలకు చెందిన పలు విమానాలు సాంకేతిక సమస్యలకు గురువుతున్నాయి. ఆకాశంలో ఉన్న సమయంలోనే టెక్నికల్ సమస్యలు వస్తున్నాయి. దీంతో సమీపంలోని విమానాశ్రయాలకు విమానాలను మళ్లిస్తున్నారు. ఇటీవల డొమెస్టిక్ ఫ్లైట్స్ తో పాటు ఇంటర్నేషనల్ విమానాలు కూడా సాంకేతిక సమస్యలను ఎదుర్కొన్నాయి. తాజాగా ఎయిరిండియాకు చెందిన బోయింగ్ ఫ్లీట్ బీ 787, ఫ్లైట్ నెంబర్ ఎఐ-934 విమానం దుబాయ్ నుంచి కొచ్చిన్ వస్తున్న సమయంలో సాంకేతిక సమస్య తలెత్తింది. విమానంలో ప్రెషర్ కు సంబంధించిన సమస్యలు ఏర్పడ్డాయి. దీంతో విమానాన్ని ముంబై ఎయిర్ పోర్టుకు మళ్లించారు. ఈ ఘటనపై ఇద్దరు సీనియర్ అధికారులు విచారణ జరుపుతున్నట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) వర్గాలు వెల్లడించాయి. ఆకాశంలో ఉన్న క్రమంలో విమానంలో ప్రెషర్ తగ్గడంతో వెంటనే ఫైలెట్ రిపోర్టు చేయడంతో ముంబైకి మళ్లించినట్లు తెలుస్తోంది. విమానం ప్రయాణిస్తున్న సమయంలో క్యాబిన్ డి ప్రెషరైస్డ్ సమస్యలు తీవ్ర ప్రమాదాలకు దారి తీస్తాయి.
Read Also: Drug Smuggling: చెన్నైలో “వీడొక్కడే” సీన్.. ముంబైలో పట్టుబడిన డ్రగ్స్
ఇదిలా ఉంటే ఇటీవల కాలంలో చాలా విమానాలు ఇలాగే సాంకేతిక సమస్యలను ఎదుర్కొంటున్నాయి. గడిచిన రెండు రోజుల్లో మూడు గో ఫస్ట్ విమానాలు సాంకేతిక సమస్యలు ఎదుర్కొన్నాయి. గత ఆదివారం ఇదే విధంగా రెండు అంతర్జాతీయ విమానాలు సాంకేతిక సమస్యలతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యాయి. షార్జా నుంచి హైదరాబాద్ వస్తున్న ఇండిగో ఫ్లైట్ లో సాంకేతిక లోపం ఏర్పడటంతో పాకిస్తాన్ కరాచీ జిన్నా అంతర్జాతీయ విమనాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఇదే రోజు కాలికట్ నుంచి దుబాయ్ వెళ్తున్న ఎయిరిండియా విమానాన్ని ఓమన్ దేశం మస్కట్ లో సాంకేతిక సమస్యలతో ల్యాండ్ చేశారు.