AIR INDIA Crash: ఆ మూడు సెకన్లలో అసలేం జరిగింది? విమానం కూలి ఏడాది గడుస్తున్నా ఇప్పటికీ అంతుచిక్కని ప్రశ్నలు!

Air India Crash Anniversary

Air India Crash Anniversary

గాల్లోకి ఎగిరిన కేవలం మూడు సెకన్లలోనే ఒక భారీ విమానం కుప్పకూలింది. అందులోని ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. భారత ఏవియేషన్ చరిత్రలో అదొక చీకటి రోజు. ఆ ఘోరమైన ఎయిర్ ఇండియా 171 విమాన ప్రమాదం జరిగి ఇవాళ్టి(జూన్ 12)కి ఏడాది పూర్తయింది. ఇంతకీ అసలు ఆ రోజు కాక్‌పిట్‌లో ఏం జరిగింది? అత్యాధునిక విమానంలోని సాంకేతిక లోపమా? పైలట్ల తప్పిదమా? సమాధానం దొరకని ఎన్నో ప్రశ్నలు మృతుల కుటుంబాలను ఇప్పటికీ వేధిస్తున్నాయి. అసలు ఎయిర్ ఇండియా 171 క్రాష్ వెనుక దాగి ఉన్న మిస్టరీ ఏంటి? విచారణ సంస్థలు ఏం తేల్చబోతున్నాయి?

జూన్‌ 12, 2025న ఏం జరిగింది?

2025 జూన్ 12న అహ్మదాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి లండన్ బయలుదేరిన ఎయిర్ ఇండియా 171 విమానం రన్‌వే పైనుంచి గాల్లోకి ఎగిరింది. టేకాఫ్ తీసుకున్న సరిగ్గా మూడు సెకన్లకే కాక్‌పిట్‌లోని రెండు ఫ్యూయల్ స్విచ్‌లు కటాఫ్ పొజిషన్‌కు మారాయి. వెంటనే రెండు ఇంజిన్లకు ఇంధన సరఫరా నిలిచిపోవడంతో క్షణాల్లో బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానం సమీపంలోని మెడికల్ హాస్టల్ భవనంపై కుప్పకూలింది. ఈ ఘోర ప్రమాదంలో విమానంలో ఉన్న ప్రయాణికులు.. సిబ్బందితో పాటు.. కింద ఉన్న హాస్టల్ విద్యార్థులు మొత్తం 260 మంది ప్రాణాలు కోల్పోయారు. విమానంలో అత్యవసర ద్వారం పక్కన 11A సీట్లో కూర్చున్న బ్రిటిష్ జాతీయుడు విశ్వాస్‌కుమార్ రమేష్ అనే వ్యక్తి ఒక్కడే ప్రాణాలతో మిగిలాడు. క్రాష్ అయిన వెంటనే 1000 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతతో మంటలు చెలరేగడంతో మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి. మృతులను గుర్తించడానికి డీఎన్ఏ పరీక్షల కోసం వారాల సమయం పట్టింది. 1996 చర్కీ దాద్రి ఘటన తర్వాత భారత్‌లో జరిగిన అతిపెద్ద విమాన ప్రమాదం ఇదే.

×
×
Ad

ఈ రెండు థియరీల్లో ఏది నిజం?

విమానం కూలిపోయి ఏడాది గడుస్తున్నా ఈ ప్రమాదానికి కచ్చితమైన కారణం ఎవరికీ తెలియదు. ప్రధానంగా ఈ క్రాష్ వెనుక రెండు వాదనలు వినిపిస్తున్నాయి. ఈ రెండు కూడా ఇంధన స్విచ్‌లకు సంబంధించినవే. మొదటి వాదన మానవ తప్పిదం. టేకాఫ్ సమయంలో పైలట్లు కావాలనే ఇంజిన్ స్విచ్ కటాఫ్ చేశారా అన్న అనుమానాలు ఉన్నాయి. ఇక రెండో వాదన పూర్తిగా సాంకేతిక లోపం. అత్యాధునిక బ్యాకప్ సిస్టమ్స్ ఉన్న బోయింగ్ విమానంలో అకస్మాత్తుగా ఎలక్ట్రికల్.. మెకానికల్ వైఫల్యం తలెత్తి ఇంజిన్లకు ఇంధనం ఆగిపోయిందన్నది మరో కోణం. ఈ రెండు థియరీల్లో ఏదీ అధికారికంగా నిర్ధారణ కాలేదు. ఈ ప్రమాదానికి కారణం పైలట్ల తప్పే అయితే విమానయాన రంగంలో అది పెను సంచలనం అవుతుంది. ఒకవేళ విమానానిదే లోపం అని తేలితే తయారీ సంస్థ బోయింగ్‌కు బిలియన్ డాలర్ల నష్టంతో పాటు గ్లోబల్ ఏవియేషన్ ఇండస్ట్రీకి కోలుకోలేని దెబ్బ తగులుతుంది.

అంతర్జాతీయ నిబంధనల ప్రకారం ప్రమాదం జరిగిన దేశమే విచారణకు నేతృత్వం వహిస్తుంది. భారతదేశ ఏవియేషన్ విచారణ సంస్థ- AAIB ఈ ప్రమాదంపై దర్యాప్తు కొనసాగిస్తోంది. నిబంధనల ప్రకారం నెల రోజుల్లో ప్రాథమిక నివేదికను.. ఏడాది లోపు తుది నివేదికను సమర్పించాలి. తుది నివేదిక రాకపోతే కనీసం మధ్యంతర నివేదికను బయటపెట్టాలి. గత ఏడాది జులైలో విడుదల చేసిన ప్రాథమిక నివేదిక.. కొన్ని సంచలన విషయాలను ప్రస్తావించింది. టేకాఫ్ అయిన ఒకే ఒక్క సెకన్ గ్యాప్‌లో ఇంజిన్ 1.. ఇంజిన్ 2 ఫ్యూయల్ స్విచ్‌లు రన్ నుంచి కటాఫ్ పొజిషన్‌కు మారినట్లు రిపోర్ట్ స్పష్టం చేసింది. స్విచ్ ఎందుకు కటాఫ్ చేశావని ఒక పైలట్ ప్రశ్నించగా తాను చేయలేదని మరో పైలట్ బదులిచ్చినట్లు కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ ద్వారా తెలిసింది. ఆ వెంటనే విమానం వేగంగా కిందకు పడిపోతూ మేడే.. మేడే.. మేడే అంటూ పైలట్ చేసిన చివరి కాల్ మాత్రమే రికార్డ్ అయ్యింది.

ప్రాథమిక నివేదిక వచ్చిన తర్వాత అనేక ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. ఈ క్రాష్ వెనుక పైలట్ల తప్పిదం ఉందంటూ అమెరికా అధికారులు భావిస్తున్నట్లు గత ఏడాది కొన్ని వార్తాసంస్థలు కథనాలు రాశాయి. ఈ ప్రమాదం తర్వాత కొద్ది నెలలకే లండన్-బెంగళూరు రూట్‌లో వెళ్తున్న మరో ఎయిర్ ఇండియా బోయింగ్ 787 విమానంలో ఫ్యూయల్ స్విచ్ సమస్య తలెత్తింది. ఈ ఘటన తర్వాత బోయింగ్ విమానాల్లోని డిజైన్ పైనే అనుమానాలు మరింత బలపడ్డాయి. ఆ స్విచ్ ప్యానెల్‌ను ప్రత్యేకంగా అమెరికాలోని బోయింగ్ హెడ్‌క్వార్టర్స్‌కు పంపి పరీక్షలు జరుపుతున్నారు. గతంలో 737 మ్యాక్స్ విమానాల డిజైన్ లోపాలను బోయింగ్ సంస్థ దాచిపెట్టిన చరిత్రను ఇప్పుడు విమర్శకులు గుర్తుచేస్తున్నారు.

సరైన కారణం తేలని విమాన ప్రమాదాలు ఏవియేషన్ ఇండస్ట్రీకి ఎప్పుడూ శాపంగా మారుతున్నాయి. 2022లో కూలిపోయిన చైనా ఈస్టర్న్ విమాన ప్రమాదంపై ఆ దేశం నేటికీ స్పష్టమైన కారణం బయటపెట్టలేదు. అలాగే 1999నాటి ఈజిప్ట్ ఎయిర్ విమానం క్రాష్ వ్యవహారంలో పైలట్ తప్పిదమని అమెరికా చెప్పగా.. సాంకేతిక లోపమని ఈజిప్ట్ వాదించింది. ఎయిర్ ఇండియా 171 విచారణ కూడా ఇలాంటి వాదనల మధ్య ఉండిపోకూడదు. ఖచ్చితమైన సమాధానం బయటికి రావాలి. పైలట్ల తప్పిదం అయితే విమానయాన సంస్థలు తమ సిబ్బంది మానసిక స్థితిపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఒకవేళ విమానం లోపమైతే ప్రపంచవ్యాప్తంగా ఉన్న వేలాది డ్రీమ్‌లైనర్ విమానాల్లో మార్పులు చేయాలి. ఇక ప్రమాదానికి గల కారణం ఎంత చేదుగా ఉన్నా ప్రపంచానికి తెలియాలి. అప్పుడే ఆకాశ ప్రయాణానికి భరోసా ఉంటుంది.

: ఫణి కుమార్ (NTV DIGITAL)