NTV Telugu Site icon

Air India: తొలి ఫ్లైట్ జర్నీలో మద్యం, ఫుడ్ ఖాళీ చేసేసిన సూరత్ ప్యాసింజర్స్!

Airindia

Airindia

విమాన ప్రయాణం అంటే సహజంగా భాగ్యవంతులు ప్రయాణం చేస్తుంటారు. ఎందుకంటే ఖరీదైన టికెట్లు కొనుగోలు చేసి సామాన్యులు ప్రయాణం చేయలేరు. ఎక్కువగా డబ్బు ఉన్నవాళ్లు.. లేదంటే వీఐపీలు జర్నీ చేస్తుంటారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇదంతా ఎందుకంటారా? తాజాగా ప్రారంభమైన తొలి ఫ్లైట్ జర్నీలో సూరత్ ప్రయాణికుల తీరు ఆశ్చర్యం గొల్పుతోంది. వారంతా సరికొత్త రికార్డ్ సృష్టించారని ఎయిరిండియా తెలిపింది. అసలేం జరిగిందో తెలియాలంటే ఈవార్త చదవండి.

డిసెంబర్ 20న (శుక్రవారం) గుజరాత్‌లోని సూరత్ నుంచి థాయ్‌లాండ్‌ రాజధాని బ్యాంకాక్‌కు తొలి ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ప్రారంభమైంది. విమానంలోని సీట్లన్నీ పూర్తిగా నిండిపోయాయి. మొత్తం 300 మంది ప్యాసింజర్స్ జర్నీ చేస్తున్నారు. కేవలం సూరత్ నుంచి బ్యాంకాక్‌కు 4 గంటల ప్రయాణం. విమానంలో సహజంగా మద్యం, ఫుడ్ సరఫరా చేస్తుంటారు. అయితే సూరత్ ప్రయాణికులు మాత్రం.. కరవు కాలం అన్నట్టుగా విమానంలో ఉన్న మద్యం, ఫుడ్ మొత్తం ఆరగించేశారు. బ్యాంకాక్‌కు చేరకముందే 15 లీటర్ల విస్కీ, బీరు తాగేశారు. అంతేకాకుండా ఆయా రకాలు ఆహారాన్ని కూడా ఆరగించేశారు. మొత్తంగా రూ.1.80 లక్షల ఖరీదైన మద్యం తాగేసినట్లుగా సిబ్బంది తెలిపారు. మరింత కావాలని ప్రయాణికులు కోరగా.. సిబ్బంది చేతులెత్తారు. స్టాక్ అయిపోయినట్లుగా తెలిపారు.

4 గంటల జర్నీలో దాదాపుగా విమానంలో ఉన్న ప్రయాణికులంతా వీటిని ఖాళీ చేసినట్లగా ఎయిరిండియా సిబ్బంది చెప్పుకొచ్చారు. ఇది ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ చరిత్రలోనే రికార్డ్ సృష్టించింది. గుజరాత్‌లో మద్య నిషేధం అమల్లో ఉంది. దీంతో మద్యం కోసం ఆవురావురుగా ఉన్న ప్రయాణికులంతా విమానం ల్యాండ్ కాక ముందే పూర్తిగా ఖాళీ చేసేసినట్లుగా సిబ్బంది పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక విమానంలో ప్రయాణికుల కోసం గుజరాతీ వంటకాలు అందించారు. థెప్లా, ఖమన్ వంటి పదార్థాలతో పాటు పిజ్జా సహా ఇతర వంటకాలు అందుబాటులో ఉంచారు. అయితే తాజాగా గుజరాత్‌లో మద్య నిషేధం అమలుపై నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మద్యం కోసం గుజరాతీయులు ఎంతగా తపిస్తున్నారో ప్రభుత్వాలు ఆలోచించాలని కోరుతున్నారు. పరిమితుల్లో మద్యం విక్రయించి ఆదాయం రాబట్టాలని నెటిజన్లు కోరుతున్నారు.

 

 

Show comments