Site icon NTV Telugu

BMC Results: ముంబైలో “రిసార్ట్” పాలిటిక్స్.. స్టార్ హోటల్‌లో షిండే సేన కార్పొరేటర్లు..

Shiv Sena

Shiv Sena

BMC Results: బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) ఎన్నికల్లో బీజేపీ+శివసేన(షిండే) కూటమి సంచలన విజయం సాధించింది. గత రెండు దశాబ్ధాలుగా నగరంపై ఉన్న ఠాక్రేల ఆధిపత్యాన్ని కూల్చేసింది. అయితే, ఇప్పుడు ముంబైలో ‘‘రిసార్ట్’’ రాజకీయాలు మొదలయ్యాయి. ఎన్నికల్లో కింగ్ మేకర్‌గా నిలిచిన షిండే శివసేన తన కార్పొరేటర్లను ముంబైలోని ఒక ఫైవ్ స్టార్ హోటల్‌కు తరలించడం ప్రారంభించింది. దేశంలోనే అత్యంత ధనిక పౌరసంస్థ అయిన ముంబైలో కొత్త పాలక వర్గం కొలువుదీరే ముందు రాజకీయాలు మొదలయ్యాయి.

ఈ రిసార్ట్ పాలిటిక్స్ ముందు రెండు ప్రధాన కోణాలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రతిపక్ష పార్టీలు ఏకమయ్యే అవకాశం ఉన్నందున షిండే ఈ ఎత్తుగడ వేసినట్లు తెలుస్తోంది. ఇదే కాకుండా, మరో కారణం ఏంటంటే.. మేయర్ పదవిని తామే సొంతం చేసుకునే యోచనలో షిండే ప్లాన్ వేస్తున్నట్లు తెలుస్తోంది. బీజేపీతో బేరసారాలను నడిపించేందుకు తన కార్పొరేటర్లను హోటల్‌కు తరలిస్తున్నట్లు సమచారం.

బీఎంసీ లెక్కలు ఇవే:

227 స్థానాలు ఉన్న ముంబైలో మెజారిటీ మార్క్ 114. బీజేపీ 89 స్థానాలు సాధించగా, షిండే శివసేన 29 స్థానాల్లో గెలిచింది. ఈ రెండు పార్టీలు కలిస్తే మొత్తం సంఖ్య 118, ఇది మెజారిటీ మార్కును సులభంగా దాటుతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులో ఉన్నప్పటికీ, ముంబై ఎన్నికల్లో మాత్రం అజిత్ పవార్ ఎన్సీపీ సింగిల్‌గా పోటీ చేసింది. మూడు స్థానాలు గెలుచుకుంది.

ఇక ప్రతిపక్షాల విషయానికి వస్తే ఉద్ధవ్ ఠాక్రేకు చెందిన శివసేన యూబీటీ 65 స్థానాల్లో గెలుపొందింది. రాజ్ ఠాక్రే ఎంఎన్ఎస్ 6 స్థానాలు గెలుచుకుంది. వీరిద్దరి బలం 72గా ఉంది. కాంగ్రెస్ 24, ఎంఐఎం 08, సమాజ్‌వాదీ పార్టీ 02 స్థానాల్లో విజయం సాధించాయి. ప్రతిపక్షాల మొత్తం బలం 106గా ఉంది. మరో 08 మంది తోడైతే బీఎంసీని కైవసం చేసుకునే అవకాశం ఉంది. అయితే, ఇక్కడే ఫిరాయింపుల భయం తలెత్తుతోంది. ప్రతిపక్షాల వైపు 08 మంది వెళ్తే బీజేపీ ఆశలు ఆవిరయ్యే అవకాశం ఉంది.

ఎన్డీయే కూటమిలో జూనియర్ భాగస్వామిగా ఉన్న షిండే శివసేన ముంబై మేయర్ పదవిపై కన్నేసింది. బీజేపీతో తమ బేరసారాల శక్తిని పెంచుకోవాలని చూస్తోంది. దీంతోనే రిసార్ట్ పాలిటిక్స్‌కు తెర తీసింది. మేయర్ పదవి శివసేనను వరించేలా షిండే టీమ్ కోరుకుంటోంది. మేయర్ పదవిపై రాజీ పడొద్దని పలువురు కార్పొరేటర్లు షిండేపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికలకు 25 ఏళ్ల ముందు వరకు అవిభక్త శివసేననే ముంబైలో అధికారంలో ఉంది. ఇప్పుడు బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. అన్ని లెక్కలు దాదాపుగా పూర్తయితే బీఎంసీ పీఠంపై బీజేపీ మేయర్ ఉండే అవకాశం ఉంది.

Exit mobile version