నావికాదళానికి 25వ చీఫ్ (సీఎన్‌ఎస్) గా అడ్మిరల్ ఆర్. హరికుమార్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. 41సంవత్సరాల పాటు విధి నిర్వహణ సాగించి పదవీ విరమణ చేసిన చీఫ్ అడ్మిరల్ కరంబీర్ సింగ్ నుండి ఆయన బాధ్యతలు తీసుకున్నారు. వెస్ట్రన్ నావల్ కమాండ్‌లో ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్‌గా పనిచేసిన హరికుమార్ ఈ నెల 9న కొత్త సీఎన్‌ఎస్‌గా నియమితులయ్యారు.
130 నౌకలు కలిగిన భారత నావికాదళం ప్రస్తుతం పలు ప్రధానమైన ఆధునీకరణ ప్రణాళికలను చేపట్టే క్రమంలో వుంది. మరిన్ని జలాంతర్గాములను, సాయుధ డ్రోన్‌లను నావికాదళంలోకి తీసుకోనున్నారు. ఇప్పటికే జాప్యం జరిగిన ఈ క్రమాన్ని మరింత వేగవంతం చేయాల్సిన అవసరం వుంది. 1981 డిసెంబరులో నేషనల్ డిఫెన్స్ అకాడమీ నుండి గ్రాడ్యుయేట్ అయిన అడ్మిరల్ కుమార్ 1983 జనవరి 1న నేవీలో చేరారు. దాదాపు 39సంవత్సరాలు సుదీర్ఘ కెరీర్‌లో పలు పదవులను చేపట్టారు.
