NTV Telugu Site icon

Ranya Rao: నటి కాదు.. పెద్ద కిలాడీ.. వెలుగులోకి రన్యా రావు బాగోతాలు

Ranyarao

Ranyarao

రన్యా రావు కన్నడ నటి. పైగా ఐపీఎస్ ఆఫీసర్ కుమార్తె. ఇప్పుడు ఆమె పేరు దేశ వ్యాప్తంగా మార్మోగిపోతుంది. ఏదో గొప్ప పని చేసిందనో.. ఘనకార్యం చేసిందనో కాదు. కుటుంబ గౌరవానికి తగ్గట్టుగా ఉండాల్సిన ఆమె.. నీచానికి ఒడిగట్టింది. విదేశాల నుంచి బంగారం స్మగ్లింగ్ చేస్తూ అడ్డంగా దొరికిపోయింది. లక్ష కాదు.. రెండు లక్షలు కాదు.. ఏకంగా కోట్ల విలువైన బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారంటే.. ఈమె ఎంత పెద్ద కిలాడీనో అర్థం చేసుకోవచ్చు.

మార్చి 3న బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో రన్యారావును కస్టమ్స్ అధికారులు తనిఖీ చేయగా.. రూ.12 కోట్ల విలువైన 14.8 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీంతో అధికారులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. దుబాయ్ నుంచి ఇలా పలుమార్లు బంగారం స్మగ్లింగ్ చేసినట్లుగా అధికారులు గుర్తించారు. ఆమె ఇంటిని సోదా చేయగా.. అక్కడ కూడా కోట్ల విలువైన బంగారాన్ని గుర్తించినట్లుగా సమాచారం. జనవరి నుంచి మార్చి 3 వరకు దాదాపు 27 సార్లు దుబాయ్ వెళ్లి వచ్చినట్లుగా అధికారులు గుర్తించారు. తన తండ్రి హోదాను అడ్డంపెట్టుకుని.. ఒక కానిస్టేబుల్ సాయంతో ఎలాంటి తనిఖీలు లేకుండా ఎయిర్‌పోర్టులో ఆమె కథ నడిపించినట్లుగా తెలుస్తోంది. బంగారం బిస్కెట్లు.. తొడలకు స్టిక్కర్లతో అంటించుకుని బయటకు వచ్చేసేదని సమాచారం అయితే ఆమె వెనుక బలమైన రాజకీయ శక్తులు ఉన్నట్లుగా డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు అనుమానిస్తు్న్నారు.

తాజాగా ఆమె బోగాతానికి సంబంధించి మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. యూఏఈ నుంచి ఇటీవల రన్యారావు 17 బంగారు బిస్కెట్లను తీసుకొచ్చారని అధికారులు తెలిపారు. దుబాయ్‌కు మాత్రమే కాకుండా యూరప్‌, సౌదీ అరేబియా, అమెరికా, పశ్చిమాసియా దేశాల నుంచి కూడా బంగారం స్మగ్లింగ్ చేసినట్లుగా డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ తెలిపింది. ఈ విషయాలు ఆమెనే చెప్పినట్లుగా అధికారులు తెలిపారు. అయితే ఈ విషయాలను రహస్యంగా ఉంచాలని ఆమె అధికారులను కోరినట్లు తెలుస్తోంది. తనకు కొంత విశ్రాంతి ఇవ్వాలని.. ఎప్పుడు విచారణకు రమ్మంటే అప్పుడు వస్తానని చెప్పినట్లుగా సమాచారం.

గతేడాది ఆమె 30 సార్లు దుబాయ్‌కు వెళ్లారని.. ఈ మధ్య కాలంలో కేవలం 15 రోజుల్లో నాలుగుసార్లు విదేశాలకు వెళ్లినట్లుగా అధికారులు గుర్తించారు. ప్రతి ట్రిప్‌లో కొన్ని కిలోల బంగారాన్ని అక్రమంగా రవాణా చేసినట్లుగా దర్యాప్తులో తేలిందని అధికారులు పేర్కొన్నారు. స్మగ్లింగ్ చేసినందుకు ప్రతి ట్రిప్‌కు ఆమెకు రూ.12 లక్షల వరకు ముట్టినట్లు అధికారులు వెల్లడించారు.

రన్యారావు తండ్రి రామచంద్రరావు ఐపీఎస్ ఆఫీసర్‌గా ఉన్నారు. కుమార్తె స్మగ్లింగ్ వార్త తెలిసి.. గుండె పగిలిపోయిందని ఆయన అన్నారు. స్మగ్లింగ్ గురించి తనకు తెలియదన్నారు. 2024లో జతిన్ హుక్కేరితో రన్యారావు వివాహం జరిగినట్లుగా చెప్పారు. అయితే వారిద్దరూ కలిసి ఉండడం లేదని.. విడిగా ఉండడం వల్ల ఆమె ఇలాంటి పనులు చేస్తుందని చెప్పుకొచ్చారు. ఆమె చర్యలతో తనకు సంబంధం లేదని పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే రామచంద్రరావు కూడా ఒక వివాదంలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. 2014 హవాలా కేసులో పెద్ద మొత్తంలో డబ్బు మాయం చేసినట్లుగా ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. అలాగే నకిలీ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు గ్యాంగ్‌స్టర్ల మరణాలపై 2016 నుంచి సీఐడీ దర్యాప్తు కేసు కూడా ఉంది. ప్రస్తుతం ఈ కేసులు దర్యాప్తులో ఉన్నాయి.