Site icon NTV Telugu

Salman Khan: సల్మాన్ హత్యకు కుట్ర.. ఇంటి వద్ద రెక్కీ

Salman Khan Threat

Salman Khan Threat

Accused Hinted That There Was Plan To attack Salman Khan: కొన్ని రోజుల క్రితం బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్‌తో పాటు అతని తండ్రి సలీమ్ ఖాన్‌ను హతమారుస్తామంటూ ఒక బెదిరింపు లేఖ వచ్చిన విషయం తెలిసిందే! పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలను చంపినట్టుగానే, ఆ ఇద్దరిని చంపుతామని దుండగులు ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ కేసుని సీరియస్‌గా తీసుకొని పోలీసులు విచారిస్తుండగా.. ఒకదాని తర్వాత మరొకటి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ బెదిరింపుల వెనుక గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ హస్తం కచ్ఛితంగా ఉండొచ్చని అనుమానంతో.. పోలీసులు ఆ కోణంలోనే విచారణ చేపట్టారు. అయితే.. తనకు ఈ బెదిరింపులతో సంబంధమే లేదని లారెన్స్ తిరస్కరించాడు. తనని అనవసరంగా ఇరికిస్తున్నారని వాపోయాడు. కానీ, ఇప్పుడు అతనిదే ప్రధాన హస్తముందని పోలీసులు నిగ్గు తేల్చారు.

సిద్ధు మూసేవాలా హత్య కేసులో అరెస్ట్ అయిన కపిల్ పండిట్‌ను సల్మాన్‌కు వచ్చిన బెదిరింపు లేఖ కేసులో విచారించగా.. తాము సల్మాన్, అతని తండ్రి సలీమ్‌ని చంపేందుకు వారి ఇంటి వద్ద రెక్కీ నిర్వహించినట్టు అంగీకరించాడు. లారెన్స్ బిష్ణోయ్ సూచనలతోనే తాను మరో ఇద్దరితో కలిసి రెక్కీ నిర్వహించినట్టు అతడు ఒప్పుకున్నాడని పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ నిన్న తెలిపారు. కపిల్ పేర్కొన్న ఆ ఇద్దరు వ్యక్తుల్ని కూడా తాము త్వరలోనే విచారిస్తామని ఆయన పేర్కొన్నారు. ఇక సిద్ధూ మూసేవాలా హత్యకేసులో 35 మంది నిందితుల ప్రమేయం ఉందని గుర్తించిన పోలీసులు.. ఇప్పటి వరకు 23 మందిని అరెస్ట్ చేశారు. మరో ఇద్దరిని ఎన్‌కౌంటర్‌లో హతమార్చారు. వారిని అరెస్ట్ చేయడానికి వెళ్లగా, వాళ్లు ఓపెన్ ఫైర్ చేయడంతో.. పోలీసులు కూడా తిరుగు కాల్పులు చేయాల్సి వచ్చింది. ఈ కాల్పుల్లో వాళ్లు చనిపోయారు. ఇక మూసేవాలపై కాల్పులకు పాల్పడిన ఆరుగురు ప్రధాన నిందితుల్లో ఒకరైన చివరి వ్యక్తిని, శనివారం అరెస్ట్ చేశారు.

1998లో ‘హమ్ సాత్ సాత్ హై’ సినిమా షూటింగ్ సమయంలో.. జోధ్‌పూర్‌లోని కంకణి గ్రామంలో తన తోటి నటీనటులతో కలిసి సల్మాన్ ఖాన్ కృష్ణ జింకలను వేటాడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కృష్ణ జింకలను బిష్ణోయ్ వర్గాలు ఎంతో ఆరాధ్యంగా భావిస్తారు. అందుకే, సల్మాన్‌ని వాళ్లు టార్గెట్ చేశారు. గతంలో కూడా సల్మాన్‌ని చంపుతామని బెదిరింపులు వచ్చాయి. ఇప్పుడు మళ్లీ బెదిరింపులు వచ్చిన నేపథ్యంలో.. సల్మాన్‌కి సెక్యూరిటీ పెంచారు.

Exit mobile version