కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఢిల్లీలో అభిజీత్ దీప్కేను అరెస్ట్ చేసిన కొద్దిసేపటికే మహారాష్ట్రలో విషాదం చోటుచేసుకుంది. అభిజీత్ దీప్కే నానమ్మ సావిత్రీబాయి దీప్కే (85) హింగోలి జిల్లాలో కన్నుమూశారు. ఢిల్లీలో దీప్కే, ఆయన సహచరులను పోలీసులు అదుపులోకి తీసుకున్న కొన్ని గంటల వ్యవధిలోనే ఈ ఘటన చోటుచేసుకోవడం విశేషం. సావిత్రీబాయి మృతి వార్త తర్వాత దీప్కే తల్లిదండ్రులు హింగోలికి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలంటూ కాక్రోచ్ జనతా పార్టీ అక్టోబర్ 10న ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర నిరసనకు పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఢిల్లీకి చేరుకున్న అభిజీత్ దీప్కే, ఆయన సహచరులను విమానాశ్రయంలో ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీప్కే ఇన్‌స్టాగ్రామ్ లైవ్ సందర్భంగా రికార్డయినట్లు చెబుతున్న ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అందులో మహిళా పోలీసు సిబ్బందితో సహా పలువురు పోలీసులు విమానంలోకి వచ్చి ఆయన దగ్గరకు వెళ్లడం కనిపించింది. ఈ సమయంలో దీప్కే.. “ఢిల్లీ పోలీసులు విమానంలోకి వచ్చారు. మమ్మల్ని అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు” అని చెప్పినట్లు వీడియోలో వినిపిస్తోంది. దీప్కేతో పాటు సీజేపీ కార్యకర్తలు సౌరవ్ దాస్, ఆశుతోష్ రంకాలను కూడా విమానాశ్రయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
జంతర్ మంతర్ దగ్గర నిర్వహించనున్న నిరసనకు ఎన్నికల సంఘం వ్యవహారశైలే ప్రధాన కారణమని సీజేపీ తెలిపింది. ఎన్నికల సంఘం దుర్వ్యవహారానికి పాల్పడుతోందని ఆరోపిస్తూ.. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని పార్టీ డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో నిరసనకు హాజరయ్యేందుకు వచ్చిన దీప్కే, ఇతర కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది.

