Site icon NTV Telugu

Madhya Pradesh Farmers: అదృష్టం తలుపు తట్టిన వేళ.. రాత్రికి రాత్రే కోటీశ్వరులైన రైతులు

Panna Farmers Diamond

Panna Farmers Diamond

A Group Of Farmers In Madhya Pradesh Panna Found A Valuable Diamond: అదృష్టం తలుపు తడితే.. బిచ్చగాడు కూడా కోటీశ్వరుడు అవుతాడు. ఇందుకు ఉదాహరణగా కొన్ని సందర్భాలు చోటు చేసుకున్నాయి కూడా! ఇప్పుడు తాజాగా అలాంటి సందర్భమే మరొకటి వెలుగులోకి వచ్చింది. వజ్రాలు దొరుకుతాయన్న సంకల్పంతో తవ్వకాలు మొదలుపెట్టిన రైతులకు.. ఎట్టకేలకు ఒక బహుమూల్యమైన వజ్రం దొరికింది. దీంతో వాళ్లు రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయ్యారు. ఆ వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని పన్నా జిల్లా బ్రిజ్‌పూర్‌కు చెందిన రాజేంద్ర గుప్త అనే రైతు.. కొంతకాలం క్రితం తన ఆరుగురు స్నేహితులతో కలిసి లల్కీ ధేరి ప్రాంతంలో ఒక వజ్రాల మైన్‌ని లీజుకు తీసుకున్నాడు.

అప్పట్నుంచి వాళ్లందరూ కలిసి వజ్రాల వేట ప్రారంభించారు. ఒక నెల రోజుల పాటు నిరంతరాయంగా శ్రమించారు. కానీ, వజ్రాలు దొరకలేదు. అయినా నిరాశచెందకుండా.. ఎలాగైనా వజ్రాల్ని సాధించాలన్న సంకల్పంతో తమ వేటని ముందుకు కొనసాగించారు. ఈ క్రమంలోనే వారికి గురువారం 3.21 క్యారెట్ల వజ్రం దొరికింది. దీంతో.. వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. తాము పడిన కష్టానికి ఫలితం దక్కిందని చాలా సంతోషించారు. ఆ వజ్రాన్ని తీసుకొని వాళ్లు వెంటనే డైమండ్ ఆఫీస్‌కు తీసుకెళ్లి, అధికారులకు చూపించారు. దాన్ని పరిశీలించిన అధికారులు.. ఆ వజ్రం విలువ భారీ మొత్తంలో ఉండొచ్చని అంచనా వేశారు. ఆ వజ్రాన్ని వేలం వేయడం ద్వారా వచ్చే డబ్బును తాము సమానంగా పంచుకొని, ఏదైనా వ్యాపారం ప్రారంభిస్తామని చెప్పారు.

ప్రభుత్వ నియమాల ప్రకారం.. ప్రభుత్వేతర మైన్స్ లేదా పొలాల్లో వజ్రాలు లేదా ఇతర విలువైన వస్తువులు దొరికితే, దాని మొత్తం విలువలో నుంచి యజమానికి 12.50 శాతం డబ్బులు అందుతాయి. అంటే.. ఈ రైతులకు కూడా అంతే మొత్తం అందుతుంది. ఒకవేళ ఈ నిధి గురించి ప్రభుత్వానికి తెలియజేయకపోతే, ఈ వ్యవహారం కోర్టుకెక్కుతుంది. అప్పుడు యజమాని ఆ నిధి తనదేనని చట్టబద్ధంగా నిరూపించుకోవలసి ఉంటుంది. కాగా.. పన్నాలోని జర్వాపూర్ గ్రామంలోనూ మరో రైతుకి ఇటీవల రూ. 30 లక్షల విలువ చేసే వజ్రం దొరికింది. అయితే.. అతడు దాదాపు రెండేళ్ల పాటు తవ్వకాలు జరిపాడు.

Exit mobile version