Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలకు రాష్ట్రంలో 74 మంది మృతి చెందారు. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు, వరదల కారణంగా రూ. 10వేల కోట్ల నష్టం జరిగినట్టు అధికారులు అంచనా వేశారు. నైరుతి రుతుపవనాలు ప్రారంభమైన 55 రోజుల్లో రాష్ట్రంలో భారీ వర్షాలతోపాటు.. వరదలు రాష్ట్రాన్ని అతలా కుతలం చేస్తున్నాయి. వర్షాల మూలంగా కొండచరియలు విరిగిపడుతుండటంతో ప్రమాదాలు జరుగుతూ.. ప్రాణాలు పోతున్నాయి. పర్యావరణపరంగా దుర్బలమైన హిమాలయాల్లో అశాస్త్రీయ నిర్మాణాలు, తరిగిపోతున్న అటవీ విస్తీర్ణం, నీటి ప్రవాహానికి అడ్డుకట్ట వేసే వాగుల దగ్గర నిర్మాణాల వల్ల తరచూ కొండచరియలు విరిగిపడుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. 113 కొండచరియలు విరిగిపడటంతో పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (PWD)కి సంబంధించిన రూ. 2,491 కోట్లు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI)కి రూ 1,000 కోట్లు నష్టం వాటిల్లినట్టు అధికారులు తెలిపారు. సిమ్లాలోని సమ్మర్ హిల్‌లో, రైల్వే ట్రాక్‌లలో కొంత భాగం కొట్టుకుపోయి, పట్టాలు గాలిలో వేలాడుతూ ఉన్నాయి.
Read also: Sukanya Samridhi Scheme: ప్రతిరోజు రూ.300లు పొదుపు చేస్తే రూ.50 లక్షల ఆదాయం.. ఎలాగో తెలుసా?
భారత వాతావరణ శాఖ (IMD) సిమ్లా, సోలన్, మండి, చంబా మరియు పరిసర ప్రాంతాల్లో భారీ వర్షపాతంతో కొన్ని చోట్ల ఉరుములతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. ఆదివారం నుంచి రాష్ట్రంలో వరుసగా మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిశాయి. మంగళవారం తర్వాత వర్షాలు తగ్గుముఖం పట్టగా, గురువారం కొన్ని చోట్ల మాత్రమే చిరు జల్లులు పడ్డాయి. జూన్ 24 న రుతుపవనాలు ప్రారంభమైనప్పటి నుండి హిమాచల్ ప్రదేశ్‌లో వర్షాలకు సంబంధించిన సంఘటనలలో కనీసం 217 మంది మరణించారు. హిమాచల్‌లో వినాశకరమైన వర్షపాతం కేవలం మౌలిక సదుపాయాలను నాశనం చేయడమే కాకుండా మొత్తం కుటుంబాలను నిర్మూలించింది. సిమ్లా దేవాలయం కొండచరియలు విరిగిపడటంతో మూడు తరాలకు చెందిన ఏడుగురి కుటుంబం తుడిచిపెట్టుకుపోయింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ముగ్గురు పిల్లలతో సహా కుటుంబంలోని ఏడుగురు సభ్యులు లోపల ఉండగా శివాలయం కూలిపోయింది. భారీ వర్షాల మూలంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు చోదక శక్తిగా ఉన్న టూరిజం మరియు యాపిల్ వ్యాపారం అత్యంత దారుణంగా ప్రభావితమయ్యాయి. టాక్సీ డ్రైవర్లు, గతంలో రోజుకు రూ. 2,000 సంపాదించేవారు, ఇప్పుడు కనీసం రూ. 200 కంటే తక్కువ సంపాదిస్తున్నారని చెబుతున్నారు. 50 నుంచి 60 శాతం ఆక్యుపెన్సీ ఉన్న హోటల్‌లు మరియు గెస్ట్ హౌస్‌లు ప్రస్తుతం 5 శాతానికి పడిపోయాయని వ్యాపారులు చెబుతున్నారు.
