Site icon NTV Telugu

India Oil Supply: చమురు కొరతను ఖండించిన ప్రభుత్వ వర్గాలు.. బిగ్ రిలీఫ్..!

India Oil Supply

India Oil Supply

India Oil Supply: ఇరాన్-ఇజ్రాయెల్‌ ఉద్రిక్తతల నేపథ్యంలో దిగుమతులపై ఆధారపడే భారత్‌లో చమురు కొరత ఏర్పడింది.. ముడి చమురు దిగుమతి నిలిచిపోవడంతో.. చమురు నిల్వలు తగ్గి.. భారత్‌లో పెట్రో ఛార్జీల పెరుగుదలకు దారి తీయవచ్చు అనే భయాందోళనలు నెలకొన్న వేళ.. చమురు కొరతను ఖండించాయి కేంద్ర ప్రభుత్వ వర్గాలు.. హార్ముజ్ జలసంధి మూసివేతతో ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాపై ఆందోళనలు వ్యక్తమవుతున్నప్పటికీ, భారతదేశం ఇంధన భద్రత పరంగా సౌకర్యవంతమైన స్థితిలో ఉందని ప్రభుత్వ ఉన్నతాధికారులు వెల్లడించారు.

నేషనల్‌ మీడియాతో మాట్లాడిన ప్రభుత్వ వర్గాల ప్రకారం, భారతదేశం ముడి చమురు సరఫరాలో 60 శాతం హార్ముజ్ జలసంధి కాకుండా ఇతర మార్గాల ద్వారా పొందుతోంది. కేవలం 40 శాతం సరఫరాలే ఆ కారిడార్ ద్వారా వస్తున్నాయని తెలిపారు.. అంతేకాదు.. ప్రస్తుతం దేశంలో పెట్రోల్, డీజిల్ వంటి ఉత్పత్తులతో కలిపి 3 నుండి 4 వారాల వరకు సరిపడే ముడి చమురు నిల్వలు ఉన్నాయని అధికారులు స్పష్టం చేశారు. ఎల్పీజీ (LPG), ఎల్ఎన్జీ (LNG) సరఫరా విషయంలో కూడా భారత్ సౌకర్యవంతమైన స్థితిలోనే ఉందని తెలిపారు.

ప్రపంచంలో మూడవ అతిపెద్ద చమురు దిగుమతిదారుగా భారత్ విదేశీ చమురు దిగుమతులపై ఆధారపడుతున్నప్పటికీ, తక్షణ కొరత పరిస్థితి లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో, ముఖ్యంగా Ayatollah Ali Khamenei చుట్టూ చోటుచేసుకున్న పరిణామాల తర్వాత ప్రాంతీయ పరిస్థితిని కేంద్ర ప్రభుత్వం నిశితంగా గమనిస్తోంది. హార్ముజ్ జలసంధి వ్యూహాత్మకంగా అత్యంత కీలక మార్గం. ఈ మార్గం గుండా ప్రపంచ చమురు రవాణాలో గణనీయమైన భాగం జరుగుతుంది. ఈ కారిడార్‌ను ఇరాన్ మూసివేసినట్టు వచ్చిన వార్తలతో అంతర్జాతీయ మార్కెట్లలో ఆందోళన పెరిగింది.

రష్యా ముడి చమురు దిగుమతులపై చర్చలు
చమురు మంత్రిత్వ శాఖ, చమురు మార్కెటింగ్ కంపెనీలు పరిస్థితిని సమీక్షిస్తూ అత్యవసర చర్యలపై చర్చిస్తున్నాయి. అవసరమైతే రష్యా నుంచి మరింత ముడి చమురును దిగుమతి చేసుకునే అవకాశాన్ని కూడా పరిశీలించవచ్చని వర్గాలు సూచించాయి. భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం నేపథ్యంలో రష్యా ముడి చమురు దిగుమతులపై పరిమితుల అంశం ఉన్నప్పటికీ, గత ఒప్పందాల ప్రకారం సరఫరాలు కొనసాగుతున్నాయని సమాచారం. ప్రస్తుతం పరిస్థితిని ప్రభుత్వం సమీక్షిస్తూ, ప్రజల్లో అనవసర భయాలు అవసరం లేదని స్పష్టం చేసింది. ప్రత్యామ్నాయ మార్గాలు, వ్యూహాత్మక నిల్వలు, సరఫరా వైవిధ్యీకరణ వల్ల భారతదేశం తక్షణ ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొనే పరిస్థితి లేదని అధికారులు పేర్కొన్నారు.

Exit mobile version