Site icon NTV Telugu

Operation Sindoor: ఇది భారత్ దెబ్బ.. 6 నెలలైనా కోలుకోలేని పాకిస్తాన్..

Operation Sindoor

Operation Sindoor

Operation Sindoor: పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత, భారత్ పాకిస్తాన్‌పై ‘‘ఆపరేషన్ సిందూర్’’ పేరుతో నాలుగు రోజులు పాటు మినీ యుద్ధాన్ని జరిపింది. ఈ ఘర్షణలో పీఓకే, పాకిస్తాన్‌లోని ఉగ్రస్థావరాలను భారత్ క్షిపణులతో ధ్వంసం చేసింది. లష్కరే తోయిబా మురిడ్కే స్థావరంతో పాటు, బలహల్పూర్‌లోని జైషే మహ్మద్ ఉగ్రవాద హెడ్ ‌క్వార్టర్స్‌పై దాడులు నిర్వహించి, వందలాది మంది ఉగ్రవాదుల్ని హతమార్చింది. ఆ తర్వాత, పాకిస్తాన్ ఆర్మీ భారత్‌పై కవ్వింపులకు పాల్పడితే, పాకిస్తాన్ వ్యాప్తంగా ఉన్న ఆ దేశ వైమానిక స్థావరాలపై భారత సైన్యం విరుచుకుపడింది. భారత దాడుల్లో చెందిన మురిద్, రఫికి, ముషాఫ్, భోలారి, ఖాద్రిమ్, సియాల్‌కోట్,సుక్కూర్‌లోని పాకిస్తాన్ వైమానిక దళ స్థావరాలతో సహా పది పాకిస్తాన్ సైనిక స్థావరాలు ధ్వంసమయ్యాయి.

అయితే, దాడులు జరిగి 6 నెలలు అయినా కూడా పాకిస్తాన్ తన నష్టాలను కప్పిపుచ్చులేకపోతోంది. దాడుల తర్వాత ఇప్పటికీ పాక్ ఎయిర్ బేసుల్లో మరమ్మతు పనులు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా, పాక్ కిరానా హిల్స్ లోని పాక్ అణ్వాయుధ డిపో దగ్గర భారత్ దాడులు చేసిందనే వార్తలు వచ్చాయి. ఇదిలా ఉంటే, ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత దళాలు జరిపిన దాడుల్లో రావల్పిండిలోని నూర్ ఖాన్ ఎయిర్ బేస్‌ దారుణంగా దెబ్బతింది. అయితే, ధ్వంసమైన ఎయిర్ బేస్‌లో ఇప్పటికీ పాకిస్తాన్ నిర్మాణ పనులు చేస్తూనే ఉందని ప్రముఖ OSINT నిపుణుడు డామియన్ సైమన్ ఎక్స్‌లో ఇటీవల పోస్ట్ చేశారు.

Read Also: Maoist Hidma Encounter: హిడ్మా ఎన్‌కౌంటర్ స్థలంలో భారీ ఆయుధాలు, పేలుడు పదార్ధాలు స్వాధీనం !

‘‘మే 2025 ఘర్షణ సమయంలో భారత్ దాడులు చేసిన పాకిస్తాన్ నూర్ ఖాన్ ఎయిర్ బేస్‌లో కొత్త ఫెసిలిటీ నిర్మిస్తున్నట్లు కనిపిస్తోంది’’ అని ఆయన నవంబబర్ 16న ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఉత్తర సింధ్‌లోని జాకోబాబాద్ ఎయిర్‌బేస్‌లో, భారత దాడులకు గురైన హ్యాంగర్ ఇప్పటికీ మరమ్మతులకు గురవుతోందని ఆయన అన్నారు. ముఖ్యంగా, భారత్ జరిపిన దాడుల్లో రావల్పిండి ఎయిర్ బేస్‌పై దాడి చాలా ప్రత్యేకమైంది. పాకిస్తాన్ సైనిక హెడ్ క్వార్టర్ అయిన రావల్పిండిలోని నూర్ ఖాన్ ఎయిర్ బేస్‌పై భారత్ భారీ దాడుల చేసి, తన వైఖరి ఏంటో సూటిగా పాకిస్తాన్‌కు చెప్పింది.

భారత దాడుల్లో నూర్ ఖాన్ ఎయిర్ బేస్ ధ్వంసమైనట్లు ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ స్వయంగా ఒప్పుకున్నారు. పాకిస్తాన్ అణ్వాయుధాలను పర్యవేక్షించే సంస్థ అయిన స్ట్రాటజిక్ ప్లాన్స్ డివిజన్ ప్రధాన కార్యాలయానికి ఈ ఎయిర్ బేస్ సమీపంలో ఉంది. సిందూర్ సమయంలో పాకిస్తాన్, భారత పౌరుల్ని టార్గెట్ చేసుకున్న తర్వాత భారత సైన్యం పాకిస్తాన్‌లోని 11 సైనిక స్థావరాలపై దాడులు చేసింది.

Exit mobile version