NTV Telugu Site icon

Semicon India: సెమీకండక్టర్‌ పరిశ్రమలకు 50 శాతం ఆర్థిక సాయం: ప్రధాని మోడీ

Semicon India

Semicon India

Semicon India: సెమీకండక్టర్‌ తయారీ పరిశ్రమలకు కేంద్రం 50 శాతం ఆర్థిక సాయం చేయనుంది. దేశంలో సెమీకండక్టర్ల తయారీ పరిశ్రమలకు ఊతం ఇచ్చే దిశగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. స్థానికంగా సెమీకండక్టర్ల తయారీ పరిశ్రమలు నెలకొల్పే టెక్నాలజీ సంస్థలకు 50 శాతం ఆర్థిక సాయం అందించనున్నట్లు చెప్పారు. ఇలాంటి పరిశ్రమలకు తమ ప్రభుత్వం రెడ్‌కార్పెట్‌ పరుస్తోందని అన్నారు. శుక్రవారం గుజరాత్‌ రాజధాని గాందీనగర్‌లో ‘సెమికాన్‌ ఇండియా–2023’ సదస్సును ప్రధాని మోదీ ప్రారంభించారు. ప్రపంచంలో వేర్వేరు కాలాల్లో ప్రజల ఆకాంక్షలు, అవసరాలే ప్రతి పారిశ్రామిక విప్లవాన్ని ముందుకు నడిపించాయని గుర్తుచేశారు. ఇప్పుడు నాలుగో పారిశ్రామిక విప్లవాన్ని భారతీయుల ఆకాంక్షలే ముందుకు నడిపిస్తున్నాయని తాను నమ్ముతున్నానని ప్రధాని తెలిపారు. భారత్‌లో సెమీకండక్టర్‌ పరిశ్రమ అభివృద్ధికి పూర్తి అనుకూల వాతావరణం ఉందన్నారు. ‘సెమికాన్‌ ఇండియా’ కార్యక్రమంలో భాగంగా పరిశ్రమ వర్గాలకు ప్రోత్సాహకాలు ఇస్తున్నామని వివరించారు. ఇకపై దేశంలో సెమికండర్టక్‌ తయారీ పరిశ్రమలు ఏర్పాటు చేసే సంస్థలకు ఏకంగా 50 శాతం ఆర్థిక సాయం అందజేయనున్నట్లు స్పష్టం చేశారు.

దేశ వ్యాప్తంగా 300 కాలేజీల్లో సెమికండక్టర్‌ డిజైన్‌ కోర్సులను ప్రారంభించనున్నారు. భారత్‌లో సెమీకండక్టర్‌ పరిశ్రమ వృద్ధికి ఇక ఆకాశమే హద్దు అని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఏడాది క్రితం భారత్‌లో ఈ పరిశ్రమలో ఎందుకు పెట్టుబడులు పెట్టాలని ప్రశ్నించేవారని, ఇప్పుడు ఎందుకు పెట్టకూడదో చెప్పాలని అడుగుతున్నారని వ్యాఖ్యానించారు. ఈ రంగంలో పెట్టుబడులకు భారత్‌ ‘గ్రాండ్‌ కండక్టర్‌’గా మారుతోందని హర్షం వ్యక్తం చేశారు. విశ్వసనీయమైన ‘చిప్‌ సప్లై చైన్‌’ అవసరం ప్రపంచానికి ఉందన్నారు. నేషనల్‌ క్వాంటన్‌ మిషన్‌’ను ఇటీవలే ఆమోదించామని, నేషనల్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టబోతున్నామని ప్రధాని మోడీ వెల్లడించారు. క్వాంటమ్‌ టెక్నాలజీలో శాస్త్రీయ పరిశోధనలు, అభివృద్ధి, నూతన ఆవిష్కరణలకు క్వాంటన్‌ మిషన్‌ దోహదపడుతుందన్నారు. సెమికండక్టర్‌ పరిశ్రమకు అవసరమైన విద్యుత్‌ ఉత్పత్తిపై దృష్టి పెట్టామని, దేశంలో పదేళ్లలో సౌర విద్యుదుత్పత్తి సామర్థ్యం 20 రెట్లు పెరిగిందని గుర్తుచేశారు. సోలార్‌ పీవీ, గ్రీన్‌ హైడ్రోజన్, ఎలక్ట్రోలైజర్స్‌ విధానాల్లో కరెంటును ఉత్పత్తి చేయాలని నిర్ణయించామన్నారు. సదస్సులో పలు దేశాల పారిశ్రామికవేత్తలు, సెమికండక్టర్‌ రంగ నిపుణులు పాల్గొన్నారు.