results for the five state elections will be released today.
దేశవ్యాప్తంగా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. 5 రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పోటీ పడుతున్నాయి. అంతేకాకుండా ఆప్, ఎస్పీ తదితర పార్టీల నేతలు కూడా తమ అభ్యర్థులు గెలవడం ఖాయం అంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం 8 గంటలకు 5 రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. యూపీలో 403 స్థానాలకు 7 విడతల్లో పోలింగ్ జరిగింది. దీంతో యూపీలోని మొత్తం 75 జిల్లా కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు చేపట్టేందుకు ఏర్పాట్లు చేశారు. పంజాబ్‌లో 117 స్థానాలకు ఒకే విడుతలో ఎన్నికలు జరిగాయి. పంజాబ్‌లోని మొత్తం 66 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరుగనుంది. పంజాబ్ ఎన్నికల్లో 1,304 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అందులో 93 మంది మహిళలు పోటీ చేస్తున్నారు.
అంతేకాకుండా పంజాబ్ ఎన్నికల బరిలో ఇద్దరు ట్రాన్స్ జెండర్లు కూడా పోటీ చేస్తుండటం విశేషం. ఉత్తరాఖండ్‌లో 70 స్థానాలకు ఒకే విడుతలో ఎన్నికలు జరుగగా, 13 జిల్లాల పరిధిలో ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. ఉత్తరాఖండ్ ఎన్నికల్లో 632 మంది బరిలో ఉన్నారు. గోవాలో 40 స్థానాలకు ఒకే విడుతలో పోలింగ్ జరిగింది. అక్కడ 332 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. దీనితో పాటు మణిపూర్‌లో 60 స్థానాలకు 2 విడుతల్లో ఎన్నికలు జరుగగా, ఎన్నికల బరిలో 265 మంది పోటీపడుతున్నారు. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు ఎన్నికల అధికారులు సర్వ సిద్ధం చేశారు. అయితే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తర్‌ప్రదేశ్ ఫలితాలపైనే అందరి దృష్టి ఉంది.
