Noida Twin Towers: ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో అక్రమంగా నిర్మించిన సూపర్‌టెక్ ట్విన్ టవర్స్ ఆగస్టు 28న ఒక్కపెట్టున కూలిపోనున్నాయి. 40 అంతస్తుల టవర్లను కూల్చివేయడానికి కనీసం 3,700 కిలోల పేలుడు పదార్థాలను అమర్చారు. అన్ని అంతస్తుల్లో అమర్చిన పేలుడు పదార్థాలు, వైర్లతో అనుసంధానించబడతాయి. ఈ పనులు మరో రెండు మూడు రోజుల్లో పూర్తవుతాయి. గత కొన్ని వారాలుగా ట్విన్ టవర్స్‌లో పేలుడు పదార్థాలను అమర్చే పనులు కొనసాగుతున్నాయి. సెయాన్ టవర్‌లో ఇప్పటికే పేలుడు పదార్థాలు అమర్చగా, ఇప్పుడు అపెక్స్‌లో పేలుడు పదార్థాలను అమర్చే పని కూడా పూర్తయింది. ఆగస్టు 28 మధ్యాహ్నం 2.30 గంటలకు కుతుబ్ మినార్ కంటే ఎత్తైన సూపర్‌టెక్ అక్రమ ట్విన్ టవర్లు 9 సెకన్లలో కూల్చివేయబడతాయి. ప్రకంపనలను తగ్గించడానికి ఇంపాక్ట్ కుషన్‌లు రూపొందించబడ్డాయి. ఒక వరుసలో పేలుడు పదార్థాలు అన్ని పేలడానికి 9 నుంచి 10 సెకన్ల సమయం పడుతుందని ఎడిఫైస్ ఇంజినీరింగ్ భాగస్వామి ఉత్కర్ష్ మెహతా చెప్పారు.
నోయిడా డీసీపీ ట్రాఫిక్ గణేష్ షా సోమవారం సూపర్ టెక్ ట్విన్ టవర్లను సందర్శించారు. ట్రాఫిక్ ప్లానింగ్ చివరి దశలో ఉందని, కొద్దిరోజుల క్రితం ట్విన్ టవర్ల ముందున్న రోడ్డును మూసివేశారని, కూల్చివేత రోజున దానికి అనుసంధానంగా ఉన్న అన్ని రహదారులను మూసివేస్తామని చెప్పారు. ఈ కూల్చివేత సమయంలో డ్రోన్లతో పాటు ఏ వాహనం కూడా లోపలికి రావడానికి వీలు లేదని అధికారులు వెల్లడించారు. టవర్స్‌కు ముందువైపు 450 మీటర్ల మేర, మిగిలిన వైపుల 250 మీటర్ల మేర ఈ ఎక్స్‌క్లూజివ్ జోన్‌ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అలాగే అక్కడి నోయిడా ఎక్స్‌ప్రెస్‌వేపై ఆదివారం మధ్యాహ్నం 2.15 నుంచి 2.45 వరకు వాహనాల రాకపోకలను నిలిపివేయనున్నారు.
Pakistan: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై పాకిస్తాన్ ఫైర్..
అపెక్స్ (32 అంతస్తులు), సెయాన్ (29 అంతస్తులు) కూల్చివేత వల్ల దాదాపు 35,000 క్యూబిక్ మీటర్ల మేర శిథిలాలు మిగిలిపోతాయి. వీటిని క్లియర్ చేయడానికి కనీసం మూడు నెలల సమయం పడుతుంది.పేలుడు పదార్థాలతో జంట టవర్లను కూల్చివేయడానికి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. కసరత్తు ఆగస్టు 21న ప్రారంభం కావాల్సి ఉండగా.. నోయిడా అథారిటీ అభ్యర్థనను అంగీకరించిన కోర్టు కూల్చివేత తేదీని ఆగస్టు 28కి పొడిగించింది. నోయిడాలో 2009లో సెక్టార్ 93 ప్రాంతంలో సూపర్ టెక్ లిమిటెడ్ కంపెనీ ఈ భారీ ప్రాజెక్టు చేపట్టింది. ఈ భవనాల నిర్మాణం విషయంలో బిల్డర్లు నిబంధనలను పాటించలేదు. దీనిపై స్థానికంగా ఉన్న నలుగురు వ్యక్తులు.. ఓ లీగల్ కమిటీగా ఏర్పడి సూపర్‌టెక్‌కు వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించారు. ఇరు వర్గాల వాదనలు విన్న సుప్రీంకోర్టు 40 అంతస్తుల ట్విన్ టవర్స్ కూల్చివేయాలని ఆదేశాలు జారీ చేసింది. అందులో 915 ఫ్లాట్లు, 21 దుకాణాలు ఉన్నాయి. తాజాగా ఈ కూల్చివేత డెడ్‌లైన్‌ను సుప్రీంకోర్టు ఆగస్టు 28కి పొడిగించింది. ఈ నిర్దిష్ట తేదీ నుంచి సెప్టెంబర్ 4వరకు కూల్చివేత ప్రక్రియను పూర్తిచేయాలని పేర్కొంది.
