Indian Airforce: ఈ ఏడాది ప్రారంభంలో పాకిస్థాన్‌లోకి బ్రహ్మోస్ క్షిపణిని ప్రయోగించినందుకు గాను ముగ్గురు భారత వైమానిక దళ అధికారులను తొలగించినట్లు ప్రభుత్వం మంగళవారం తెలిపింది. “ఒక బ్రహ్మోస్ క్షిపణి అనుకోకుండా 09 మార్చి 2022న ప్రయోగించబడింది. కేసును విచారించడానికి ఏర్పాటు చేసిన కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ (కల్నల్) ఘటనకు బాధ్యులుగా ముగ్గురు అధికారులను సేవలను నుంచి తప్పించారు. ఆ అధికారులు ప్రమాదవశాత్తు క్షిపణిని పేల్చారు’’ అని వైమానిక దళం ఒక ప్రకటనలో తెలిపింది.
“ఈ ముగ్గురు అధికారులు ఈ ఘటనకు ప్రాథమికంగా బాధ్యత వహించారు. వారి సేవలను కేంద్ర ప్రభుత్వం తక్షణమే రద్దు చేసింది. 23 ఆగస్టు 2022న అధికారులపై తొలగింపు ఉత్తర్వులు అందించబడ్డాయి” అని ఆ ప్రకటనలో వైమానిక దళం పేర్కొంది. ఈ క్షిపణిని మార్చిలో పాకిస్తాన్‌లోని ఒక ప్రాంతంలో అనుకోకుండా భారతదేశం వైపు నుండి ప్రయోగించారు. ఈ ఘటనపై రక్షణ మంత్రిత్వ శాఖ తీవ్ర విచారం వ్యక్తం చేయడంతో పాటు సాంకేతిక లోపం అని తెలిపింది.
పాకిస్తాన్ ప్రకారం.. క్షిపణి తమ గగనతలంలోకి 100 కి.మీ కంటే ఎక్కువ దూరంతో పాటు 40,000 అడుగుల ఎత్తులో, ధ్వని కంటే మూడు రెట్లు ఎక్కువ వేగంతో ఎగిరిందని పేర్కొంది. క్షిపణిపై వార్‌హెడ్ లేకపోవడంతో అది పేలలేదు. ఇస్లామాబాద్‌లో భారతదేశం ఛార్జ్ డి’అఫైర్స్‌ను పిలిపించి.. దాని గగనతలంలో ఉల్లంఘన జరిగినట్లు ఆ దేశ విదేశాంగ కార్యాలయం తెలిపింది. ప్రయాణీకుల విమానాలకు, పౌరుల ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని, ఈ ఘటనపై విచారణ జరిపించాలని పాకిస్థాన్ కోరింది. ఇలాంటి నిర్లక్ష్యం వల్ల ఎదురయ్యే అసహ్యకరమైన పరిణామాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, భవిష్యత్తులో ఇటువంటి ఉల్లంఘనలు పునరావృతం కాకుండా సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని పాకిస్థాన్ భారత్‌ను హెచ్చరించింది.