ఇప్పటికే అన్ని సంస్థలను కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్‌పరం చేస్తుందనే విమర్శలు ఉన్నాయి.. క్రమంగా కొన్ని సంస్థలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తూ కేంద్రం చేతులు దులుపుకుంటుందని.. లాభాలు వచ్చే అవకాశం ఉన్న సంస్థలే కాదు.. లాభాల్లో ఉన్న సంస్థలను కూడా ప్రైవేట్‌పరం చేస్తుందని విమర్శలు లేకపోలేదు.. అయితే, మరో 25 ఎయిర్‌పోర్టులను కూడా ప్రైవేటీకరించేందుకు సిద్ధమవుతోంది నరేంద్ర మోడీ సర్కార్.. ఈ విషయాన్ని కేంద్ర పౌర విమానయానశాఖ సహాయ మంత్రి వీకే సింగ్ వెల్లడించారు..
రానున్న ఐదేళ్లలో మరో 25 విమానాశ్రయాలను ప్రైవేటీకరించనున్నట్లు తెలిపారు.. నేషనల్ మానిటైజేషన్ పైప్‌లైన్ (ఎన్ఎంపీ)లో భాగంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్న ఆయన.. ఎన్ఎంపీలో భాగంగా ఎయిర్‌పోర్ట్ అధారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) ఆధీనంలో ఉన్న 25 ఎయిర్‌పోర్ట్‌లను 2022 నుంచి 2025 వరకు ప్రైవేట్‌పరం చేస్తామని.. ఈ కాలంలో భువనేశ్వర్, వారణాసి, అమృత్‌సర్, త్రిచి, ఇండోర్, రాయిపూర్, కాలికట్, కొయంబత్తూర్, నాగ్‌పూర్, మదురై, సూరత్, రాంచీ, జోద్‌పూర్, చెన్నై, విజయవాడ, వడోదర, భోపాల్, తిరుపతి, హుబ్లీ, ఇంపాల్, అగర్తల, ఉదయ్‌పూర్, డెహ్రాడూన్, రాజమహేంద్రవరం ఎయిర్‌పోర్టులను ప్రైవేట్‌వ్యక్తులకు అప్పగించనున్నట్టు వెల్లడించారు. లోక్‌సభలో ఓ ప్రశ్నకు సమాధానంగా ఇలా వివరణ ఇచ్చారు కేంద్ర మంత్రి.
