Site icon NTV Telugu

IndiGo Flights: 200 ఇండిగో విమానాలు అకస్మాత్తుగా రద్దు.. ప్రయాణికులకు చుక్కలు

Indigo Flights

Indigo Flights

దేశ వ్యాప్తంగా 200కి పైగా ఇండిగో విమానాలు అకస్మాత్తుగా రద్దయ్యాయి. దీంతో ప్రయాణికుల ఇక్కట్లు అన్నీ ఇన్నీ కావు. హఠాత్తుగా విమాన సర్వీసులు ఆగిపోవడంతో ముఖ్యమైన ప్రయాణాలు ఉన్న వారంతా లబోదిబో అంటున్నారు. ప్రస్తుతం టెర్మినల్స్ దగ్గర ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. పొడవైన క్యూలు ఉన్నాయి. మరోవైపు ప్యాసింజర్స్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ విమాన సంస్థపై మండిపడుతున్నారు.

ఇటీవల కాలంలో అత్యంత తీవ్ర అంతరాయాల్లో ఇదొకటిగా చెప్పవచ్చు. దాదాపుగా మంగళవారం, బుధవారం మధ్య 200 విమానాలు అకస్మాత్తుగా రద్దయ్యాయి. వందలాది విమానాలు ఆలస్యం అయ్యాయి. సిబ్బంది కొరత, కొత్త డ్యూటీ-టైమ్ నియమాలు, కీలక విమానాశ్రయాల్లో సాంకేతిక లోపాలు, శీతాకాలపు కార్యకలాపాల సమయంలో భారీ రద్దీ కారణంగానే ఈ సమస్య తలెత్తినట్లుగా కనిపిస్తోంది.

నవంబర్ 1 నుంచి కొత్త కఠినమైన డ్యూటీ-టైమ్ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. దీంతో ఇండిగో పైలట్లు, క్యాబిన్ సిబ్బంది కొరతతో ఇబ్బంది పడుతోంది. తప్పనిసరి విశ్రాంతి అవసరాల నేపథ్యంలో పైలట్ల కొరత కూడా ఏర్పడింది. దీంతో విమానాలు సమయానికి బయల్దేరలేకపోయాయి. ఇక కొత్త నిబంధనల ప్రకారం డ్యూటీ షెడ్యూల్స్, నైట్-ల్యాండింగ్ ప్లాన్స్, వీక్లీ రెస్ట్ చార్టులలో మార్పులు చేయాల్సి వచ్చింది. ఎయిర్‌లైన్ షెడ్యూలింగ్ సిస్టమ్స్ పూర్తిగా దెబ్బతిన్నట్లుగా తెలుస్తోంది. కొత్త అవసరాలకు తగ్గట్టుగా లోటును భర్తీ చేయలేకపోయినట్లు సమాచారం.

ఇక మంగళవారం ఢిల్లీ, పూణెతో సహా పల విమానాశ్రయాల్లో చెక్-ఇన్, డిపార్చర్ కంట్రోల్ సిస్టమ్‌ల్లో వైఫల్యాల తలెత్తాయి. దీంతో పొడవైన క్యూలు, నిష్క్రమణలు ఆలస్యం అయ్యాయి. ఈ పరిణామాలు రోజంతా ఎక్కువైపోయాయి. దీంతో దగ్గర సంబంధం ఉన్న విమానాల రాకపోకల్లో కూడా తీవ్ర జాప్యం ఏర్పడింది.

Exit mobile version