2 Teens Accused Of Theft Tied To Truck, Dragged On Road In Madhya Pradesh: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అమానుష సంఘటన చోటు చేసుకుంది. ఇండోర్ నగరంలో దొంగతనం చేశారనే ఆరోపణలపై ఇద్దరు టీనేజర్లను దారుణంగా హింసించారు. ఇద్దరు మైనర్ బాలుర్నిని అత్యంత దారుణంగా కొట్టి వాళ్ల కాళ్లను ట్రక్కుకు కట్టేసి.. నడిరోడ్డుపై ఈడ్చుకు పోయారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటన ఇండోర్‌లోని చోయిత్రం కూరగాయల మార్కెట్ లో చోటు చేసుకుంది.
ఇద్దరు మైనర్ యువకులపై దొంగతనం ఆరోపణలపై కేసు నమోదు చేశారు పోలీసులు. దీంతో పాటు వారిని కొట్టిన వారి కోసం వేట ప్రారంభించారు. సాక్ష్యాలను పరిశీలించి కేసులు నమోదు చేస్తామని తెలిపారు. మార్కెట్ లో కూరగాయలు దించే సమయంలో ట్రక్కులో ఉంచిన డబ్బును ఇద్దరు దొంగలించారిన వ్యాపారులు, డ్రైవర్ ఆరోపించారు. నిందితులిద్దరు డబ్బు తీసుకోవడాన్ని డ్రైవర్ చూసినట్లు వెల్లడించారు. వెంటనే పక్కన ఉన్న మిగతా వ్యాపారులు నిందితులిద్దరిని పట్టుకుని చతకబాదారు. ఇద్దరి కాళ్లను కట్టేసి, ట్రక్కుతో నడిరోడ్డుపై ఇద్దరు నిందితులను వీపుపై పడుకోబెట్టుకుని ఈడ్చుకు వెళ్లారు.
ఇద్దరు యువకులను పోలీస్ స్టేషన్ తరలించి, వైద్య చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. వారిని కొట్టిన విధానం క్రూరంగా ఉందని.. ఇందుకు కారణం అయిన వారిపై కూడా చర్యలు తీసుకుంటామని.. వీడియోను చూసి కొట్టిన వారిని గుర్తిస్తామని ఇండోర్ పోలీస్ అధికారి నిహిత్ ఉపాధ్యాయ్ తెలిపారు.
