NTV Telugu Site icon

Chandipura Virus: చండీపురా వైరస్‌తో మరో ఇద్దరు చిన్నారులు మృతి.. 8కి చేరిన మృతుల సంఖ్య

Chandipura Virus

Chandipura Virus

Chandipura Virus: గుజరాత్ రాష్ట్రంలో ‘చండీపురా వైరస్’ భయాందోళనలు సృష్టిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా పలువురు చిన్నారులు మరణించారు. తాజాగా మంగళవారం మరో ఇద్దరు చిన్నారులు మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 08కి చేరిందని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రుషికేష్ పటేల్ తెలిపారు. మొత్తంగా వైరస్ బారిన పడిన వారి సంక్య 14కి చేరుకుంది. ఇందులో 8 మంది మరణించారు. సబర్‌కాంత, ఆరావళి, మహిసాగర్, ఖేడా, మెహసానా, రాజ్‌కోట్ జిల్లాల్లో కేసులు నమోదయ్యాయని మంత్రి తెలిపారు.

Read Also: Nita Ambani: కన్నీళ్లు తెప్పించిన నీతా అంబానీ స్పీచ్.. ఒక్కసారి ఉద్వేగంగా మారిన పెళ్లి వేదిక

రాజస్థాన్ నుంచి రెండు కేసులు, మధ్యప్రదేశ్‌ నుంచి వచ్చిన ఒక కేసు గుజరాత్‌లో చికిత్స పొందుతున్నట్లు మంత్రి వెల్లడించారు. రాజస్థాన్‌కి చెందిన ఇద్దరు రోగుల్లో ఒకరు మరణించారు. రాష్ట్రవ్యాప్తంగా హెల్త్ డిపార్ట్మెంట్‌ని హై అలర్ట్ చేశామని, చండీపురా వైరస్ కేసులను గుర్తించేందుకు కమ్యూనిటీ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, జిల్లా ఆస్పత్రులు, మెడికల్ కాలేజీలకు ప్రత్యేక సూచనలు చేసినట్లు తెలిపారు. ఈ వ్యాధిలో మరణాల రేటు ఎక్కువగా ఉంటుందని, వైద్యం ఆలస్యమైతే రోగి బతకడం కష్టమని అన్నారు.

ముందుజాగ్రత్తగా 26 రెసిడెన్షియల్ జోన్లలోని 8600 ఇళ్లలో 44,000 మందికి పైగా స్క్రీనింగ్ నిర్వహించినట్లు మంత్రి చెప్పారు. చండీపురా వైరస్ జ్వరాన్ని కలిగిస్తుంది, ఫ్లూ వంటి లక్షణాలతో మరియు తీవ్రమైన ఎన్సెఫాలిటిస్ (మెదడు వాపు)ని కలిగిస్తుంది. ఇది దోమలు, పేలు, ఇసుక ఈగల ద్వారా వైరస్ వ్యాప్తి చెందుతుంది. ఈ వైరస్ రాబ్డోవిరిడే కుటుంబానికి చెదిన వెసిక్యూలోవైరస్ జాతికి చెందినది. 2003-2004 కాలంలో ఈ వ్యాధి వ్యాప్తి కారణంగా ఆంధ్రప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో 56-75 శాతం వరకు మరణాల రేటు నమోదైంది. ఈ వైరస్‌ని 1965లో మహారాష్ట్రలోని చండీపురా గ్రామంలో కనుగొన్నారు. దీని వ్యాప్తి వల్ల గ్రామంలో చాలా మంది జ్వరం, మెదడువాపుతో బాధపడ్డారు. దీంతో ఈ గ్రామం పేరుతోనే వైరస్‌ని వ్యవహరిస్తున్నారు.

Show comments