English Teacher: మధ్యప్రదేశ్‌లో ఘోరం జరిగింది. తనపై అత్యాచారం జరిగిందని మహిళా ఇంగ్లీష్ టీచర్ ఫిర్యాదు చేసిన కొన్ని గంటలకే 19 ఏళ్ల యువ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడినట్లు అధికారులు బుధవారం తెలిపారు. మంగళవారం రాత్రి ఇండోర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే, తమ కుమారుడిని సదరు మహిళా టీచర్ బ్లాక్‌మెయిల్ చేస్తోందని విద్యార్థి తల్లిదండ్రులు ఆరోపించారు.
Read Also: CM Yogi Adityanath: బంగ్లాదేశ్‌లో హిందువుల్ని టార్గెట్ చేస్తున్నారు.. ఐక్యత అవసరం..
ఇండోర్ మహిళా పోలీస్ స్టేషన్ కౌశల్య చౌహాన్ ప్రకారం.. ఇండోర్‌కి చెందిన 19 ఏళ్ల బీఫార్మసీ చదువుతున్న యువకుడు మంగళవారం రాత్రి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతడి సోదరి ఉరివేసుకున్న విషయాన్ని తల్లిదండ్రులకు వెల్లడించింది. ఒక కోచింగ్ సెంటర్‌లో 25 ఏళ్ల మహిళా ఇంగ్లీష్ టీచర్, మరణించిన యువకుడిపై మూడు రోజుల క్రితం అత్యాచారం చేసినట్లు ఫిర్యాదు చేసింది. యువకుడిపై వచ్చిన ఆరోపణల్ని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థిని పోలీస్ స్టేషన్ పిలిపించి అతడి వాంగ్మూలం నమోదు చేసి విడిచిపెట్టామని పోలీసులు చెప్పారు.
అయితే, ఈ ఆత్మహత్య వెనక ఖచ్చితమైన కారణం ఇంకా తెలియాల్సి ఉంది. కేసు దర్యాప్తు జరుగుతోందని అధికారులు తెలిపారు. బాధితుడి తండ్రి తన కొడుకుని ఇంగ్లీష్ టీచర్ బ్లాక్‌మెయిల్ చేయడంతోనే ఈ చర్యకు పాల్పడినట్లు చెప్పారు. ‘‘ఆమె నా కొడుకు కన్నా కొన్నేళ్లు పెద్దది. ఆమెపై అత్యాచారం ఆరోపణలకు సంబంధించి నాకు ఎలాంటి ఐడియా లేదు. కానీ అత్యాచారం ఫిర్యాదు గురించి ఆమె బెదిరిస్తున్న మెసేజ్‌లకు సంబంధించి స్క్రీన్ షాట్లను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాను’’ అని యువకుడి తండ్రి చెప్పారు.