Maharashtra: ‘మహా’ ఘోరం.. 180 మందిపై లైంగిక దాడి.. నిందితుడి ఇల్లు కూల్చివేత

  • మహారాష్ట్రలో ఘోరం
  • 180 మందిపై యువకుడి లైంగిక దాడి
  • నిందితుడి ఇల్లు కూల్చేసిన అధికారులు
  • దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన కేసు
Maharashtra2

Maharashtra2

దేశ చరిత్రలోనే మునుపెన్నడూ చూడలేని మహా ఘోరం మహారాష్ట్రలో వెలుగుచూసింది. 19 ఏళ్ల మహ్మద్ అయాజ్ అలియాస్ తన్వీర్ అత్యంత దారుణాలకు ఒడిగట్టాడు. ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 180 మంది బాలికలను ట్రాప్ చేసి.. వేర్వేరు రహస్య ప్రాంతాలకు తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా బాలికల అశ్లీల దృశ్యాలు కూడా చిత్రీకరించి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడ్డాడు. ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన యావత్తు దేశాన్ని కలవరపాటుకు గురి చేసింది.

అమరావతి జిల్లాలోని పరత్వాడా పట్టణానికి చెందిన తన్వీర్ ‘‘లవ్ ట్రాప్’’ పేరుతో బాలికలను ముగ్గులోకి దింపేవాడు. అనంతరం ముంబై, పుణె నగరాలకు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడేవాడు. అంతేకాకుండా ఇప్పటి వరకు 350 అసభ్య వీడియోలు కూడా చిత్రీకరించాడు. వీటిని అడ్డంపెట్టుకుని బ్లాక్‌మెయిల్ చేసి వ్యభిచార కూపంలోకి దింపేవాడు. వాట్సాప్, స్నాప్‌చాట్ గ్రూపుల ద్వారా మైనర్ల బాలికలను లక్ష్యంగా చేసుకుని ట్రాప్‌లో దింపేవాడు. అయితే ఈ విషయం రాజ్యసభ ఎంపీ అనిల్ బోండే దృష్టిలో పడడంతో అతగాడి కీచక పర్వం బయటపడింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో తన్వీర్ అకృత్యాలు వెలుగులోకి వచ్చాయి.

ఏప్రిల్ 11న తన్వీర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో భయంకరమైన దారుణాలు బయటపడ్డాయి. ఇప్పటి వరకు 180 మంది బాలికలపై అత్యాచారం చేయగా.. 350 అసభ్య వీడియోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఏప్రిల్ 14న నిందితుడిని కోర్టులో హాజరుపరచగా 7 రోజుల పోలీసు కస్టడీకి ఇచ్చింది. ఈ కేసులో మరో ముగ్గురిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో ఒకరు ఉజేర్ ఖాన్ అనే నిందితుడు జరిగిన నేరాలను పూసగుచ్చినట్లు వెల్లడించాడు. ప్రస్తుతం తన్వీర్ మొబైల్‌ను పరిశీలిస్తున్నారు. వీడియోలను ఇంకెవరితోనైనా పంచుకున్నాడా? ఇంకా ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

నిందితుడి ఇల్లు కూల్చివేత
ప్రస్తుతం ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇక అధికారులు కూడా యాక్షన్‌లోకి దిగారు. అమరావతి జిల్లాలోని పరత్వాడా పట్టణంలో ఉన్న నిందితుడి ఇల్లును జేసీబీతో కూల్చివేశారు. బీజేపీ ఎమ్మెల్యే ప్రవీణ్ తాయడే సమక్షంలో ఇంటిని కూల్చేశారు. ఇంటి బయట నిర్మించిన ఇనుప మెట్లను కూడా తొలగించారు. అచల్‌పూర్ మున్సిపల్ కౌన్సిల్ అధికారుల సమక్షంలో ఈ పనులు జరుగుతున్నాయి. భారీ ఎత్తున పోలీసులు మోహరించారు.

ఎంఐఎం..
తన్వీర్‌కు గతంలో ఎంఐఎంతో సంబంధాలు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆ పార్టీ నేతలు స్పందించారు. తన్వీర్‌కు పార్టీతో ఎలాంటి సంబంధాలు లేవని అమరావతి ఎంఐఎం అధ్యక్షుడు సయ్యద్ ముజీబ్ తెలిపారు. ఇంతక ముందే తన్వీర్‌ను పార్టీ నుంచి తొలగించినట్లుగా వెల్లడించారు.