Nipah Virus: కేరళలో మరోసారి ‘నిపా’ కలకలం రేపుతోంది. మలప్పురం జిల్లాకు చెందిన 14 ఏళ్ల బాలుడికి నిపా వైరస్ సోకినట్లు ఆరోగ్యమంత్రి వీణా జార్జ్ శనివారం వెల్లడించారు. ప్రస్తుతం కేరళలో ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుడికి నిపా ఇన్ఫెక్షన్ ఉన్నట్లు పూణేలోని ఎన్ఐవి (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ) నిర్ధారించింది. ‘‘ అతడిని కోజికోడ్ లోని ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలిస్తాము. అతనితో కాంటాక్ట్ అయిన వ్యక్తుల ట్రేసింగ్ ప్రారంభించాము. హై-రిస్క్ కాంటాక్ట్‌లు ఇప్పటికే వేరుచేసి, వారి శాంపిళ్లను పరీక్షకు పంపాము’’అని వీణా జార్జ్ తెలిపారు.
Read Also: Covid-19: కరోనా వల్ల భారతదేశ ఆయుర్ధాయం 2.6 ఏళ్లు తగ్గిందా..? కేంద్రం ఏం చెబుతోంది..?
బాలుడు వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నట్లు ఆమె వెల్లడించారు. బాలుడు నివసించే ప్రాంత సమీపంలోని ప్రజలు మాస్కులు ధరించాలని, ఆస్పత్రుల్లోని రోగులను కలవకుండా ఉండాలని ఆమె కోరారు. గతంలో నాలుగు సార్లు రాష్ట్రాన్ని వణికించిన నిపా వ్యాధి నివారణకు ప్రత్యేక కార్యాచరణ క్యాలెండర్ రూపొందించినట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. 2019, 2021, 2023లో కోజికోడ్ జిల్లాలో, 2019లో ఎర్నాకులం జిల్లాలో నిపా వ్యాప్తి నమోదైంది. కోజికోడ్, వాయనాడ్, ఇడుక్కి, మలప్పురం, ఎర్నాకులం జిల్లాల్లోని గబ్బిలాలలో నిపా వైరస్ యాంటీబాడీల ఉనికిని గుర్తించారు.