NTV Telugu Site icon

Lok Sabha security breach: బీజేపీ ఎంపీ పేరుతో విజిటర్ పాస్.. పార్లమెంట్ ఘటనలో కీలక విషయాలు..

Lok Sabha Security Breach

Lok Sabha Security Breach

Lok Sabha security breach: పార్లమెంట్‌లోకి దుండగులు చొరబడటం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. డిసెంబర్ 13, 2001 పార్లమెంట్‌పై ఉగ్రవాద దాడి జరిగి 22 ఏళ్లు పూర్తియిన ఈ రోజు ఈ ఘటన చోటు చేసుకుంది. విజిటర్ గ్యాలరీ నుంచి హౌస్ ఛాంబర్‌లోకి దుండగులు ఎల్లో పొగతో కూడిన డబ్బాలతో ప్రవేశించారు. పలువురు ఎంపీలు ధైర్యంగా వీరిని పట్టుకున్నారు.

ఇదిలా ఉంటే బుధవారం లోక్‌సభలో భద్రతా ఉల్లంఘనకు పాల్పడిన వ్యక్తుల్ని పోలీసులు గుర్తించారు. నిందితుల్లో ఒకరికి బీజేపీ ఎంపీ జారీ చేసిన విజిటర్ పాస్ ఉంది. నిందితుల్లో ఒకరైన సాగర్ శర్మ, బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా పేరుతో జారీ చేయబడిని విజిటర్ పాస్ కలిగి ఉన్నాడు. మరో చొరబాటుదారుడు మైసూర్‌కి చెందిన మనోరంజన్ గా గుర్తించారు. ఇతను వృత్తిరీత్యా ఇంజనీర్ అని తేలింది. నిందితులిద్దరిది కూడా కర్ణాటకలోని మైసూర్ ప్రాంతం. పార్లమెంట్ బయట ఆందోళన చేసిన ఇద్దరిలో మహిళని నీలంగా గుర్తించారు. ఈమె హరియానాకు చెందిన వ్యక్తిగా, మరొకర్ని అమోల్ షిండేగా గుర్తించారు. ఇతడిని మహారాష్ట్రలోని లాతూర్‌గా గుర్తించారు.

Read Also: Big Breaking: ప్రజలకు శుభవార్త.. రూ. 25 లక్షల వరకూ వైద్యం ఉచితం!

విజిటర్ పాసులు ఎలా వచ్చాయి..?

ఎవరైనా పార్లమెంట్‌ని సందర్శించాలనుకునే వారు ముందుగా తమ నియోజకవర్గానికి చెందిన పార్లమెంట్ సభ్యుని పేరుతో అభ్యర్థన చేస్తారు. సాధారణంగా ఎంపీలు ఎవరి పేరోతో పాస్‌లు జారీ చేస్తారో, వారి గుర్తింపు కార్డులను విజిటర్స్ సమర్పించాల్సి ఉంటుంది. వీటిని సెక్యూరిటీ చెక్ చేస్తారు.

విజిటర్స్ పార్లమెంట్‌లోకి వెళ్లే సమయంలో ఎంట్రీ వద్ద గార్డులు, ఎలక్ట్రానిక్ మిషన్స్ ద్వారా కఠినమైన భద్రతా తనిఖీలు జరుగుతాయి. ఇంత పకడ్భందీగా సెక్యూరిటీ చెక్ ఉన్నప్పటికీ నిందితులిద్దరి వద్ద పొగడబ్బాలతో ఎలా ప్రవేశించగలిగారనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

జీరో అవర్ సమయంలో ఇద్దరు చొరబాటుదారులు మధ్యాహ్నం 1 గంటలకు పబ్లిక్ గ్యాలరీ నుంచి దూకారు. నియంత‌ృత్వం అనుమతించబడదు అంటూ నినాదాలు చేస్తూ స్పీకర్ పోడియం వైపు వెళ్లే ప్రయత్నం చేశారు. ఈ ఘటనలో పార్లమెంట్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది.