Toxic: కన్నడ స్టార్ యష్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘టాక్సిక్’ విడుదలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ, ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇటీవల విడుదలైన ‘తబాహీ’ పాట సోషల్ మీడియాలో హల్చల్ చేయడంతో సినిమా చుట్టూ మరింత హైప్ ఏర్పడింది. ఇప్పుడు అదే జోష్‌ను కొనసాగించేలా చిత్రబృందం మరో కీలక అప్‌డేట్‌తో వస్తోంది. ఈ మూవీకి సంబంధించిన రెండో పాట రిలీజ్ కు రంగం సిద్ధమవుతుండటంతో అభిమానులు కూడా ఈ సారి వచ్చే పాట ఏ టైప్ లో ఉంటుందో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
సమాచారం ప్రకారం, ఈ కొత్త పాటకు తనిష్క్ బాగ్చి, ఫహీమ్ అబ్దుల్లా, అర్స్లాన్ నిజామీ సంగీతం అందించగా, ప్రముఖ గాయకుడు సిద్ధార్థ్ బస్రూర్ స్వరాన్ని అందించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే వైరల్ అయిన ‘తబాహీ’ పాటలో యష్ సరసన కియారా అద్వానీ కనిపించగా, ఈసారి మాత్రం పూర్తిగా భిన్నమైన కాన్సెప్ట్‌తో రూపొందించిన పాటలో తారా సుతారియా యష్‌తో జతకట్టనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ పాటను రేపే విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.
ఇక పాటతో పాటు సినిమా ట్రైలర్ గురించిన వార్తలు కూడా అభిమానులను ఉత్సాహపరుస్తున్నాయి. చిత్రబృందం నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాకపోయినా, 2026 ఆగస్టు 8న ‘టాక్సిక్’ ట్రైలర్‌ను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని ప్రచారం సాగుతోంది. ట్రైలర్ విడుదలతో సినిమా కథ, యష్ పాత్రకు సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైన అంశాలు బయటపడే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు.
ఈ మూవీకి జాతీయ అవార్డు గ్రహీత గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో యష్‌తో పాటు రుక్మిణి వసంత్, నయనతార, హుమా ఖురేషి, అక్షయ్ ఒబెరాయ్, సుదేవ్ నాయర్, బాలాజీ మనోహర్, అమిత్ తివారీ, సూరజిత్ గోపీనాథ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె. నారాయణ నిర్మిస్తుండగా, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ తరఫున యష్ కూడా నిర్మాణంలో భాగస్వామిగా వ్యవహరిస్తున్నారు. సంగీత విభాగంలో రవి బస్రూర్ సహా పలువురు ప్రతిభావంతులైన సంగీత దర్శకులు కలిసి పనిచేస్తుండటం సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది.
‘కేజీఎఫ్’ తర్వాత యష్ నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌గా ‘టాక్సిక్’ ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ బజ్ ను క్రియేట్ చేసింది. ఒక్కో అప్‌డేట్‌తో సినిమాపై ఆసక్తి పెరుగుతుండగా, ఇప్పుడు రెండో పాట, ఆ తర్వాత ట్రైలర్ ను చూసేందుకు అభిమానులు కూడా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.
