Toxic Loss: ‘కేజీఎఫ్’ తర్వాత యష్ నుంచి వస్తున్న సినిమా అంటే అంచనాలు ఏ రేంజ్‌లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే ‘టాక్సిక్’ పై కూడా భారీ హైప్ ఏర్పడింది. భారీ బడ్జెట్, స్టార్ కాస్ట్, గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం, యష్ క్రేజ్‌తో ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తుందని అందరూ భావించారు. 2026 ఆగస్టు 26న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదలై ఆశించిన స్థాయిలో సినిమా నిలబడకపోయింది. అయితే ఇప్పుడు అసలు చర్చ కలెక్షన్ల గురించి కాదు.. నిర్మాతలకు ఎంత నష్టం మిగలనుందనే దానిపైనే జరుగుతోంది. ముఖ్యంగా సినిమా ఇంగ్లీష్ వెర్షన్ పరిస్థితి చూస్తే ఈ సినిమా ఎదుర్కొంటున్న సమస్య ఎంత తీవ్రమైందో అర్థమవుతోంది. యష్, నయనతార, కియారా అద్వానీ, తారా సుతారియా, హుమా ఖురేషి, రుక్మిణి వసంత్ వంటి భారీ తారాగణంతో తెరకెక్కిన ‘టాక్సిక్’ను కన్నడతో పాటు హిందీ, తెలుగు, తమిళం, మలయాళంలోకి కూడా ఈ సినిమాను డబ్ చేశారు. అయితే ఒరిజినల్ లాంగ్వేజ్ వెర్షన్‌గా ప్రత్యేకంగా రూపొందించిన ఇంగ్లీష్ వెర్షన్‌కు మాత్రం ప్రేక్షకుల నుంచి దారుణమైన స్పందన వచ్చింది. ఈ వర్షన్ కి కూడా జనాలే కరువయ్యారు.
అందుతున్న సమాచారం ప్రకారం సెప్టెంబర్ 4న దేశంలోని ఎంపిక చేసిన నగరాల్లో విడుదలైన ఈ వెర్షన్ మొదటి వారంలో కేవలం రూ.3.16 లక్షలు మాత్రమే వసూలు చేసింది. మొదటి రోజు ఇంగ్లీష్ వెర్షన్ 11 షోల ద్వారా రూ.1.38 లక్షలు రాబట్టింది. ఆ తర్వాత శనివారం రూ.78,774, ఆదివారం రూ.70,460 మాత్రమే వచ్చాయి. సోమవారం నుంచి వసూళ్లు మరింత దారుణంగా పడిపోయాయి. మంగళవారం అయితే కేవలం రూ.3,125 మాత్రమే వచ్చింది. బుధవారం రూ.5,699, గురువారం రూ.4,655 వసూలయ్యాయి. దీంతో మొదటి వారం మొత్తం కలిపి రూ.3,16,042 దగ్గరే ఆగిపోయింది. ప్రేక్షకులు లేకపోవడంతో సెప్టెంబర్ 11 నుంచి ఈ ఇంగ్లీష్ వెర్షన్ ను పూర్తిగా నిలిపివేశారు. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే, ఇంగ్లీష్ వెర్షన్ నిడివి ఇతర వెర్షన్ల కంటే తక్కువగా ఉంది. ఈ ఎడిషన్ రన్‌టైమ్ 2 గంటల 56 నిమిషాలు కాగా, మిగతా వెర్షన్ల నిడివి 3 గంటల 14 నిమిషాలుగా ఉంది. కథను కొంత టైట్‌గా ఉంచినప్పటికీ ప్రేక్షకులను థియేటర్లకు తీసుకురావడంలో మాత్రం అది ఏమాత్రం ఉపయోగపడలేదు.
ఇక ‘టాక్సిక్’ కోసం సుమారు రూ.500 కోట్లకు పైగా బడ్జెట్ ఖర్చయిందని పలు నివేదికలు పేర్కొంటున్నాయి. మొదట్లో థియేట్రికల్ రన్‌తో పాటు డిజిటల్ హక్కుల ద్వారా భారీ మొత్తాన్ని రాబట్టుకోవచ్చనే అంచనాలు ఉన్నాయి. ఒక ప్రముఖ ఓటీటీ సంస్థ నుంచి సుమారు రూ.150 కోట్ల ఆఫర్ వచ్చినప్పటికీ, మేకర్స్ మాత్రం రూ.200 కోట్లకు పైగా వస్తుందని ఆశించినట్లు రిపోర్టులు వెల్లడించాయి. థియేటర్లలో సినిమా భారీ విజయాన్ని సాధిస్తే డిజిటల్ హక్కుల ధర మరింత పెరుగుతుందని భావించినట్లు తెలుస్తోంది. అయితే సినిమా థియేటర్లలో ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో ఆ వ్యూహం ఇప్పుడు బెడిసికొట్టినట్లు కనిపిస్తోంది. ‘టాక్సిక్’ డిజిటల్ హక్కులకు ప్రస్తుతం సుమారు రూ.30 కోట్ల ఆఫర్ మాత్రమే వస్తున్నట్లు సమాచారం. ఇప్పటికీ ఓటీటీ డీల్ ఖరారు కానట్లు తెలుస్తోంది. ‘టాక్సిక్’ సినిమా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్ల వసూళ్ల మార్క్‌ను దాటినా నష్టాలు మాత్రం పూడ్చలేకపోయింది. ఈ మూవీ దాదాపు రూ.300 కోట్ల నష్టం వచ్చినట్లు పలు నివేదికలు చెబుతున్నాయి.

