NTV Telugu Site icon

Yandamuri Veerendranath: చిరంజీవిని నవలా నాయకుడిని చేసిన యండమూరి

Yandamuri Veerendranath

Yandamuri Veerendranath

Yandamuri Veerendranath: తెలుగునాట ఎంతోమందిని పాఠకులుగా మార్చిన ఘనత కాల్పనిక సాహిత్యానికే దక్కుతుంది. అప్పట్లో యద్దనపూడి సులోచనారాణి, ఆరికెపూడి కౌసల్యాదేవి నవలలు పాఠకులను పరవశింప చేయడమే కాదు, చిత్రసీమలోనూ విజయకేతనం ఎగురవేశాయి. యద్దనపూడి ‘నవలారాణి’గా రాజ్యమేలారు. సరిగ్గా ఆ సమయంలో యండమూరి వీరేంద్రనాథ్ కలం సరికొత్త వచనంతో పాఠకులను ఆకట్టుకుంది. ఆయన రచనలు సమకాలీన పరిస్థితులకు అద్దం పడుతూనే సగటు పాఠకుని ఆకట్టుకొనే ఆకర్షణీయమైన పదజాలంతో పులకింప చేశాయి. దాంతో కమర్షియల్ గా కూడా యండమూరి రచనలు గ్రాండ్ సక్సెస్ ను చూశాయి. అంతకు ముందు రచయిత్రుల నవలలే విశేషంగా అమ్ముడు పోతూ ఉన్నాయి. వారి రచనల అమ్మకాన్ని మించి యండమూరి వీరేంద్రనాథ్ రచనలు సాగాయి. దాంతో యండమూరి వీరంద్రనాథ్ ‘నవలాచక్రవర్తి’గా కీర్తి గడించారు. ఇక చలనచిత్రసీమలో నూ యండమూరి వీరేంద్రనాథ్ జయకేతనం ఎగురవేశారు. కొన్నిచిత్రాలకు దర్శకత్వం నెరిపారు.

యండమూరి వీరేంద్రనాథ్ 1948 నవంబర్ 14న తూర్పు గోదావరి జిల్లా రాజోలులో జన్మించారు. యండమూరి వీరేంద్రనాథ్ తాత మంచి పండితుడు. వీరేంద్రనాథ్ తండ్రి కుటుంబాన్ని పోషించడం కష్టతరమైన సమయంలో ఆయన కొందరి సహాయంతో చదువు కొనసాగించారు. ఆ సమయంలో తన క్షవరం తానే చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ నియమాన్ని ఇప్పటికీ ఆయన పాటిస్తూ ఉండడం విశేషం.

పేదరికం శాపం కాదు, ఆసక్తి ఉంటే ఎవరైనా బాగా చదువవచ్చునని నిరూపించారు. అప్పట్లోనే బాలగంగాధర తిలక్ కవితలపై ఆసక్తి పెంచుకొని, అలాగే వీరేంద్రనాథ్ కూడా కవితలు పలికించారు. కొన్ని కథలూ రాశారు. సి.ఏ. చేసిన తరువాత ఛార్టెడ్ అకౌంటెంట్ గా పలు సంస్థలలో సీనియర్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేశారు. కొన్ని నాటకాలూ రాశారు. ఆయన నాటకాలు సైతం అలరించాయి. ఆ సమయంలోనే వీరేంద్రనాథ్ రాసిన ‘పర్ణశాల’ సీరియల్ ఆంధ్రభూమి వారపత్రికలో ప్రచురితమైంది. ఆ సీరియల్ తో వీరేంద్రనాథ్ కు మంచి గుర్తింపు లభించింది. తరువాత యండమూరి కలం నుండి జాలువారి ఆంధ్రభూమి వారపత్రికలో ప్రచురితమైన ‘తులసి, తులసీదళం’ సీరియల్స్ తెలుగు పాఠకలోకాన్ని ఓ ఊపు ఊపేశాయి. ఆ నవలల విజయంతో యండమూరి టాప్ రైటర్ అయిపోయారు. ఆంధ్రజ్యోతిలో ‘అభిలాష’ సీరియల్ ఆకట్టుకుంది. తరువాత ‘డబ్బు టు ద పవరాఫ్ డబ్బు’, ‘రాక్షసుడు’, ‘మరణమృదంగం’ సీరియల్స్ గానూ, నవలలుగానూ పాఠకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

చిత్రసీమలో యండమూరి వీరేంద్రనాథ్ తొలుత స్క్రిప్ట్ రైటర్ గా పనిచేశారు. మృణాల్ సేన్ ‘ఒకవూరి కథ’కు స్క్రిప్ట్ రాశారు. వంశీ దర్శకత్వంలో రూపొందిన తొలి చిత్రం ‘మంచుపల్లకి’కి మాటలు పలికించారు. క్రియేటివ్ కమర్షియల్స్ సంస్థ తొలి చిత్రం ‘అభిలాష’ వీరేంద్రనాథ్ నవల ఆధారంగా తెరకెక్కిందే. ఈ చిత్రంలో చిరంజీవి కథానాయకుడు. సినిమాకు ఏ.కోదండరామిరెడ్డి దర్శకుడు, ఇళయరాజా సంగీత దర్శకుడు, కె.ఎస్.రామారావు నిర్మాత. ‘అభిలాష’ విజయం తరువాత ఈ నలుగురి కాంబోలో వరుసగా “ఛాలెంజ్, రాక్షసుడు, మరణమృదంగం” చిత్రాలు విడుదలయ్యాయి. చిరంజీవిని నవలానాయకునిగా నిలిపింది యండమూరి అనే చెప్పాలి. మరోవైపు యండమూరి వీరేంద్రనాథ్ నవలల ఆధారంగా “ఒక రాధ ఇద్దరు కృష్ణులు, దొంగమొగుడు, రక్తాభిషేకం, సంపూర్ణ ప్రేమాయణం, ముత్యమంత ముద్దు, కాష్మోరా” వంటి చిత్రాలు తెరకెక్కి అలరించాయి. యండమూరి సీరియల్స్ ను ఎంత ఆసక్తిగా పాఠకులు చదివారో, అంతే ఆసక్తిగా అవి నవలలుగా వచ్చాక కొనుక్కొని మరీ చదివారు. ఇక ఆయన రచనల ఆధారంగా సినిమాలు వస్తున్నాయంటే, వాటిపై జనం ఎంతో మోజుపడేవారు. అందుకు తగ్గట్టుగానే యండమూరి రచనలతో రూపొందిన పలు చిత్రాలు జనాన్ని అలరించాయి. ఆయన నవలల ఆధారంగా కొన్ని కన్నడ చిత్రాలు తెరకెక్కి ఆకట్టుకున్నాయి. చిరంజీవి ‘జగదేకవీరుడు-అతిలోకసుందరి’ చిత్రానికీ యండమూరి కథ సమకూర్చారు.

తన రచనల ద్వారా తెరకెక్కిన ‘అగ్నిప్రవేశం’, ‘స్టువర్ట్ పురం పోలీస్ స్టేషన్’ చిత్రాలకు తానే మెగాఫోన్ పట్టి దర్శకత్వం వహించారు. రెండు చిత్రాలూ అంతగా అలరించలేదు చిరంజీవి హీరోగా నటించిన ‘స్టూవర్ట్ పురం పోలీస్ స్టేషన్’ పరాజయం పాలయింది. దాంతో యండమూరి సినిమా కెరీర్ మునుపటిలా సాగలేదనే చెప్పాలి. చాలా గ్యాప్ తరువాత 2009లో ఏ.కోదండరామిరెడ్డి తెరకెక్కించిన ‘పున్నమి నాగు’ చిత్రానికి కథ సమకూర్చారు యండమూరి. అదీ అంతగా ఆకట్టుకోలేక పోయింది.

సమయానుకూలంగా తన కలాన్ని పరుగులు తీయించడంలో మేటి యండమూరి. కాల్పనిక సాహిత్యంపై పాఠకులకు మోజు తగ్గిన సమయాన్ని కనిపెట్టి, ఆ సమయంలో జనాన్ని ఆలోచింప చేసేలా ‘నాన్-ఫిక్షన్’ రచనలు చేశారు. వాటిలో ‘విజయానికి ఐదు మెట్లు’ ఘనవిజయం సాధించింది. అంతకు ముందు తెలుగులో ప్రచురితమైన ‘పర్సనాలిటీ డెవలప్ మెంట్’ పుస్తకాలన్నిటి కన్నా మిన్నగా ఈ పుస్తకం విక్రయాలు సాగాయి. ఇప్పటికీ ఏదో విధంగా తన రచనలతో ఆకట్టుకుంటూనే ఉన్నారు యండమూరి. ఈ ఏడాది యండమూరి దర్శకత్వంలో ‘అతడు-ఆమె-ప్రియుడు’ అనే చిత్రం జనం ముందు నిలచింది. యండమూరి కథతో రామ్ గోపాల్ వర్మ ‘తులసీ తీర్థం’ అనే చిత్రం రూపొందనుంది. ఆయన మరిన్ని పుట్టినరోజులు జరుపుకుంటూ ఆనందంగా సాగాలని ఆశిద్దాం.

(నవంబర్ 14న యండమూరి వీరేంద్రనాథ్ పుట్టినరోజు)

Show comments