NTV Telugu Site icon

Walter Veerayya: టైటిల్ సాంగ్ విషయంలో యండమూరికి చంద్రబోస్ కౌంటర్!

Chandrabose

Chandrabose

Walter veerayya: సంక్రాంతి కానుకగా చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ సినిమాతో సందడి చేయబోతున్నాడు. ఈ చిత్రంలోని టైటిల్ సాంగ్ ఇటీవల విడుదలై అభిమానులను విశేషంగా అలరిస్తోంది. ఈ గీతాన్ని దేవిశ్రీ ప్రసాద్ బాణీలకు అనుగుణంగా ప్రముఖ గీత రచయిత చంద్రబోస్ రాశారు. ఇందులో కొన్ని పదాలపై ఓ సాహితీ ప్రముఖుడు చేసిన విమర్శలను ప్రముఖ రచయిత, మెగాస్టార్ చిరంజీవిని నవలా నాయకుడిగా తీర్చిదిద్దిన యండమూరి వీరేంద్రనాథ్ సమర్థిస్తూ, తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేశారు. అవి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో యండమూరి వ్యాఖ్యలకు చంద్రబోస్ తగిన రీతిలో, తనదైన పంథాలో సమాధానం ఇచ్చారు. చంద్రబోస్ ఇచ్చిన కౌంటర్ కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.

ఇంతకూ యండమూరి సోషల్ అకౌంట్ లో పోస్ట్ చేసిన అభియోగం ఏమిటంటే, ”తుఫాను అంచున తపస్సు చేసే వశిష్ఠుడే వీడు.. తిమిర నేత్రమై ఆవరించిన త్రినేత్రుడే!” ఈ పదాలు రాసిన వారు ఎవరో కానీ అతడెందుకు రాశాడు? అతనికి ఏ సంప్రదాయం తెలుసు? ఏ పురాణ గాథలు చదివాడు?” అంటూ పేర్కొన్నారు. ”త్రినేత్రుడు అంటే శివమహాదేవుడు, ఆయన తిమిర నేత్రం అంటే చీకటి కన్ను! ఏ అర్థం తీసుకున్నా.. అది శివ దూషణే” అని పేర్కొన్నారు. అలాగే ఏ తుఫాను అంచున వశిష్ఠ మహర్షి తపస్సు చేశారో చెప్పు నాయనా అంటూ మరో ప్రశ్ననూ సంధించారు. యండమూరి సోషల్ మీడియా అక్కౌంట్ లో పెట్టిన ఈ కామెంట్ కు కొందరు లైక్ కొట్టారు. ఇంకొందరు గీత రచయితను అవహేళన చేశారు. మరికొందరు తమకు తెలిసిన రీతిలో ‘చంద్రబోస్ ఈ ప్రకారంగా ఈ గీతం రాసి ఉండొచ్చు’ అంటూ వివరణ ఇచ్చారు.

అయితే దీనిపై చంద్రబోస్ స్పందిస్తూ, ‘ఇది విరోధాభాసాలంకారం. పైకి వ్యతిరేకంగా కనిపించే పదాలు చోటు చేసుకున్నా.. వాటి మధ్య నిగూఢమైన అర్థం ఉంటుందని, అది తెలియని రచయితలు ఎవరూ ఉండర’ని అన్నారు. అలాగే తనకు విరోధాభాస అలంకారం గురించి తెలుసునని, తెలిసే ఈ పద ప్రయోగాలు చేశానని, ఆయన తన రచనను సమర్థించుకున్నారు. యండమూరి తన పోస్ట్ లో ‘తిమిరమంటే ఈ రచయితకు తెలుసా?’ అన్న మాట తనకు బాధ కలిగించిందని చంద్రబోస్ తెలిపారు. ”తిమిరమంటే చీకటి అనే అర్థం తెలియని రచయిత ఉంటాడని, ఒక రచయిత గురించి ఇంకో రచయిత అనుకోవడమే తిమిరం. అంతకంటే తిమిరం మరొకటి లేదు” అని చంద్రబోస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ వివాదంతో ఈ రచయితల సందేహాలు సమాధానాలు ఎలా ఉన్నా.. ‘వాల్తేరు వీరయ్య’ టైటిల్ సాంగ్ కు మరింత ప్రచారం జరుగుతోందని చెప్పొచ్చు!