Site icon NTV Telugu

యశ్ రాజ్ ఫిలిమ్స్ ఓటీటీ సక్సెస్ సాధిస్తుందా!?

కరోనా పుణ్యమా అని ఇండియాలో ఓటీటీ మార్కెట్ అనూహ్యంగా పెరిగింది. కరోనా ఫస్ట్, సెకండ్ వేవ్ తర్వాత ఇండియా అతి పెద్ద ఓటీటీ మార్కెట్ గా మారిందనటంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ఇండియన్ మార్కెట్ పై ఫోకస్ పెంచాయి. కరోనాతో థియేట్రికల్ రంగం కుదేలయిపోయింది. ఇప్పటికీ పలు ఏరియాల్లో థియేటర్లు ఓపెన్ కాలేదు. ఎంటర్ టైన్ మెంట్ ని ఇష్టపడే భారతీయులు తమ దృష్టిని ఓటీటీవైపు మళ్ళించారు. పలు అంతర్జాతీయ డిజిటల్ సంస్థలతో పాటు జాతీయంగానూ ఎన్నో ఓటీటీ ప్లాట్ ఫామ్స్ పుట్టుకు వచ్చాయి. కరోనా కనుమరుగై థియేట్రికల్ రంగంపై ఆశ చిగురిస్తున్నా… ఓటీటీ రంగంపై ఆసక్తి ఏమాత్రం తగ్గకపోగా రోజురోజుకీ పెరుగుతోంది. దీంతో బడా కార్పోరేట్ సంస్థలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న అగ్ర నిర్మాణ సంస్థల దృష్టి ఇప్పుడు సొంత ఓటీటీ ప్లాట్ ఫామ్స్ రూపకల్పనపై పడింది.

టాలీవుడ్ విషయానికి వస్తే ట్రెండ్ కి అనుగుణంగా అడుగులు వేసే అల్లు అరవింద్ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాను ఆరంభించి విజయం సాధించారు. ఆరంభంలో ఆటుపోటులు ఎదుర్కొన్నా అదరక బెదరక దాని అభివృద్ధి కోసం అహోరాత్రులు శ్రమించారు. టాలీవుడ్ లో సక్సెస్ సాధించిన అరవింద్ ఇతర దక్షిణాది బాషల్లోనూ ఆహాను విస్తరించే ఆలోచనలో ఉన్నట్లు వినిపిస్తోంది.

ఇదిలా ఉంటే బాలీవుడ్ లో బడా బాబులు సొంత ఓటీటీ ప్లాట్ ఫామ్ దిశగా పయనిస్తున్నారు. అందులో భాగంగా యశ్ రాజ్ ఫిలిమ్స్ కూడా బరిలో దిగడం హాట్ టాపిక్ గా మారింది.ఇప్పటికే సినిమాల నిర్మాణంలో శరవేగంగా దూసుకుపోతూ వేలాది కోట్లను కుమ్మరిస్తున్న యష్ రాజ్ ఫిల్మ్స్ దృష్టి ఓటీటీ వ్యాపారంపై పడింది. ఆ సంస్థ అధినేతల్లో ఒకరైన ఆదిత్య చోప్రా డిజిటల్ కంటెంట్ మార్కెట్ ను కబళించాలనే ప్లాన్స్ తో ఉన్నారట. దీనికోసం వందలాది కోట్లు వెచ్చించటానికి రెడీ అవుతున్నాడట. అందులో భాగంగా పలు స్క్రిప్ట్ లతో పాటు, సీరీస్ నిర్మాణానికి సిద్ధం అవుతోంది యశ్ రాజ్. అందులో భాగంగా ఒటిటి ప్లాట్ ఫామ్ లో భారతీయ కథలను ప్రపంచానికి ప్రదర్శించాలనే ఆలోచనతో ఉన్నాడట ఆదిత్య చోప్రా. గత రెండేళ్ళుగా ఆ దిశగా అడుగులు వేస్తోంది యశ్ రాజ్ ఫిలిమ్స్. యశ్ రాజ్ ఫిలిమ్స్ ఏదైనా కొత్తగా చేయాలని నిర్ణయించుకున్నప్పుడు భారీస్థాయిలో పెట్టుబడులు పెట్టి రంగంలోకి దూకుతుంది. అయితే యశ్ రాజ్ కి ఈ విషయంలో పోటీ ఘనంగా ఉండబోతోంది. ఇప్పటికే ఓటీటీ దిగ్గజాలైన నెట్ ఫ్లిక్స్, ప్రైమ్, డిస్నీహాట్ స్టార్, జీ స్టూడియోతో పాటు సోనీలివ్ వంటి సంస్థలు పాతుకుపోయి ఉన్నాయి. వాటి పోటీని తట్టుకుని తమ ఓటీటీ ప్లాట్ ఫామ్ ను విజయవంతం చేయాలంటే యశ్ రాజ్ ఎంతో శ్రమించాల్సి ఉంటుంది. మరి యశ్ రాజ్ ఆ ప్రయత్నంలో విజయం సాధిస్తుందా!? లెట్స్ వెయిట్ అండ్ సీ.

Exit mobile version