NTV Telugu Site icon

RRR Oscar Nominations : ‘ట్రిపుల్ ఆర్’కు అన్ని ఆస్కార్ నామినేషన్స్ వస్తాయా!?

Rrr

Rrr

ఆస్కార్ అవార్డుల్లో మన భారతీయ సినిమా ఇప్పటి దాకా వెలుగులు విరజిమ్మలేదు. కేవలం బ్రిటిష్ కొలాబరేషన్ తో రూపొందిన ‘గాంధీ’, ‘స్లమ్ డాగ్ మిలియనీర్’ చిత్రాలు, వాటి ద్వారా కొందరు ఇండియన్ టెక్నీషియన్స్ ఆస్కార్ అందుకోగలిగారు. కానీ, ఇప్పుడు ఎస్.ఎస్.రాజమౌళి చిత్రం ‘ట్రిపుల్ ఆర్’ ఏకంగా ఆస్కార్ లోని ప్రధాన విభాగాల్లోనూ నామినేషన్స్ సంపాదించనుందని హాలీవుడ్ మేగజైన్ ‘వరైటీ’ పేర్కొన్నట్టు ఓ వార్త హల్ చల్ చేస్తోంది. ఇంతకు ముందు ‘వరైటీ’ మేగజైన్ ఈ సినిమాలో యన్టీఆర్ కు బెస్ట్ యాక్టర్ గా నామినేషన్ లభించే ఆస్కారం ఉందని ఓ స్టోరీ ప్రచురించింది. ఆ తరువాత నుంచీ యన్టీఆర్ కు దేశవిదేశాల్లోని అభిమానుల నుండి అభినందనల వెల్లువ మొదలయింది. ప్రముఖ రాజకీయ నాయకులు సైతం జూనియర్ ను అభినందించిన విషయం విదితమే!

కాగా, ఇప్పుడు అదే వరైటీ మేగజైన్ ‘ట్రిపుల్ ఆర్’లో ఉత్తమ నటుడు విభాగంలో రామ్ చరణ్ కు కూడా ఆస్కారం ఉందనీ పేర్కొన్నట్టు న్యూస్ సందడి చేస్తోంది. అంతటితో ఆగితే బాగానే ఉండేది. ఈ సినిమాకు ప్రధాన విభాగాల్లోనూ నామినేషన్స్ దక్కుతాయనీ పేర్కొన్నట్టు ప్రచారం సాగడమే వింతగా ఉంది. ‘ట్రిపుల్ ఆర్’ సినిమాకు “బెస్ట్ పిక్చర్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ యాక్టర్, బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే, బెస్ట్ ఒరిజినల్ సాంగ్, బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిలిమ్” విభాగాల్లో నామినేషన్స్ లభిస్తాయని ఆ పత్రిక పేర్కొన్నట్లు వార్తలు పరుగులు తీస్తున్నాయి. మొదట్లో జూనియర్ యన్టీఆర్ పేరు వినిపించినప్పుడే ‘వరైటీ’ పత్రిక పై కొందరు అనుమానాలు వ్యక్తం చేశారు. ఇప్పుడు ఇన్ని విభాగాల్లో ఓ భారతీయ సినిమా నామినేషన్స్ సంపాదిస్తుందని అదే పత్రిక పేర్కొన్నట్టు ప్రచారం సాగుతోంటే అనుమానాలు పెనుభూతాలుగా మారుతున్నాయి.